మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు ఎట్టకేలకు పెరిగాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి వేతనాల పెంపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో సిబ్బందికి వేతనాలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025 నవంబర్‌లో తీసుకువచ్చిన జీఓకు అనుగుణంగా వేతనాలను సిబ్బంది ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో సూచించిన విధంగా క్యాడర్ ఆధారంగా వేతనాలు ఇచ్చారు. అయితే ఇక నుంచి పీయూలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల కిందకి వెళ్లారు. ఈ కారణంగా పలువురు సిబ్బంది అభద్రతా భావానికి లోనవుతున్నారు. మొత్తం 280 మందికి పైగా సిబ్బంది ఇప్పుడు ఏజెన్సీల కింద పనిచేయాల్సి ఉంటుంది. అయితే 7 నెలల క్రితమే నాన్‌టీచింగ్ సిబ్బందితో పీయూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఔట్‌సోర్సింగ్‌లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఐఎస్‌ఎంఎఫ్ పోర్టల్‌లో సిబ్బంది పేర్లు నమోదు చేసి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ప్రక్రియను అధికారులు తాజాగా పూర్తిచేశారు.
● పీయూలో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌లో కలపాలని రాష్ట్రస్థాయి అధికారులతో చర్చలు జరిపి 2025 నవంబర్ 11న జీఓ 1626 తీసుకువచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదు. కానీ శుక్రవారం సాయంత్రం సిబ్బందికి పెరిగిన వేతనాలతో ఖాతాలో జమయ్యాయి. దీంతో 2014 తర్వాత విధుల్లో చేరిన పలువురు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు పెరిగినట్లు తెలిసింది. అయితే వేతనాల జీఓ వచ్చిన నెల నుంచి ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు కనీసం రూ.20–30 వేల వరకు నష్టపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2010 కంటే ముందు విధుల్లో చేరిన సిబ్బందికి వేతనాలు పెరగకపోగా కొంత మందికి కోత విధించినట్లు తెలుస్తుంది. దీనిపై పలువురు సీనియర్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన వేతనాలతో పీయూతోపాటు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌లో పనిచేస్తున్న సుమారు 280 మంది సిబ్బందికి మేలు జరగనుంది.
1వ తేదీనే చెల్లింపులు..
పీయూలో గతం నుంచే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, గార్డెనింగ్ తదితర సిబ్బందికి ఏజెన్సీల నుంచి వేతనాలు అందిస్తున్నారు. ప్రభుత్వం గతనెల రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న వారికి తప్పకుండా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని సూచించడంతో పీయూ అధికారులు సైతం అలాగే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్ రమేష్‌బాబు చెప్పారు. కాగా.. డాటా ఎంట్రీ ఆపరేటర్లు, లైబ్రేరియన్, అసిస్టెంట్ ఇంజినీర్, టైపిస్ట్ కం క్లర్క్, వీసీ పీఏ, రిజిస్ట్రార్ పీఏ, లైబ్రరీ అసిస్టెంట్, డ్రైవర్స్, ల్యాబ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ కం ప్లంబర్, గేమ్ బాయ్స్, స్టాఫ్ నర్స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సూపర్‌వైజర్, ప్లంబర్లకు రూ.19,500 ఉండాలి. హౌస్‌కీపింగ్ శానిటేషన్, హెల్పర్స్, గార్డెనింగ్, స్కావెంజర్, కేర్ టేకర్, కుక్, సెక్యూరిటీ గార్డు, బుక్ కీపర్, స్వీపర్, ఆఫీస్ సబార్డినేటర్, ల్యాబ్ అటెండర్‌లకు రూ.15,600 ఇవ్వాల్సి ఉంది. కంప్యూటర్ ప్రోగ్రామర్‌కు రూ.22,500 వేతనం ఇస్తున్నారు.
ఎట్టకేలకు పీయూ నాన్‌టీచింగ్ సిబ్బందికి జీతాల పెంపు
ఈ నెల నుంచే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగింత
2010 కంటే ముందు విధుల్లో చేరిన వారి అసంతృప్తి
పెరిగిన జీతాలతో సుమారు 280 మందికి మేలు
వేతనాలు పెంచాం.
గత కొన్నేళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేసిన సిబ్బందికి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. జీఓ ఆధారంగా క్యాడర్‌ల వారిగా వేతనాలు పెరిగాయి. దీంతో యూనివర్సిటీలో పనిచేస్తున్న చాలామంది మెజార్టీ సిబ్బందికి న్యాయం జరుగుతుంది. సిబ్బంది ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూస్తాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ


