లక్ష్య సాధనలో జాప్యానికి తావులేదు | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనలో జాప్యానికి తావులేదు

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

గుడిసెల సర్వే పకడ్బందీగా చేపట్టాలి

కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట: శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని.. జాప్యానికి తావు లేదని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హౌసింగ్‌, డీఆర్డీఏ (సెర్ఫ్‌), పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొని పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వారాల్లో ఇందిరమ్మ ఇళ్లు, వీఓ భవనాల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి చూపించాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలన్నారు. 767 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని, లబ్ధిదారులు చేపట్టకపోవడానికి గల కారణాలను రాతపూర్వకంగా తీసుకొని అవసరమైతే అర్హత రద్దు చేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హౌసింగ్‌ ఏఈలకు అప్పగించిన లక్ష్యాలను రెండు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుడిసెల లెక్కింపు సర్వే త్వరగా పూర్తి చేయాలని.. గుడిసెల్లో జీవించే వారినే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించాలని చెప్పారు. పంచాయతీరాజ్‌శాఖపై సమీక్షిస్తూ జిల్లాకు గతంలో మంజూరైన 39 వీఓ భవనాల్లో ఒక్కటి కూడా పూర్తిగాకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. తాజాగా మరో 180 వీఓ భవనాలు మంజూరైన నేపథ్యంలో అన్ని గ్రామాల్లో నిర్మాణాలు వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోస్గి, మద్దూరు, గుండుమాల్‌, కొత్తపల్లి మండలాల్లో స్థల సేకరణ పూర్తిచేసి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. నిధుల మంజూరుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని అధికారులకు భరోసా ఇచ్చారు. మహిళా సంఘాలకు మంజూరైన గిడ్డంగుల నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఉపాధి కూలీల సంఖ్య పెంచి పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపులు, బ్యాంకు లింకేజీలు, శ్రీనిధి రికవరీలు, సూక్ష్మ వ్యాపారాలు, పాఠశాల యూనిఫాం కుట్టు పనులు, కిశోర బాలికల సంఘాలు, యూడీఐడీ సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలపై కూడా కలెక్టర్‌ సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, ఇన్‌చార్జ్‌ డీఎల్‌పీఓ ఉదయ్‌కుమార్‌, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పీఆర్‌ ఏఈలు, డీపీఎంలు, ఏపీవోలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement