నేరాల ఛేదనలో జాగిలాలదే కీలక పాత్ర | - | Sakshi
Sakshi News home page

నేరాల ఛేదనలో జాగిలాలదే కీలక పాత్ర

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

నారాయణపేట: నేరాల ఛేదనలో కీలకపాత్ర పోషిస్తున్న పోలీసు జాగిలాల నిర్వహణపై ఎస్పీ డా. వినీత్‌ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకేంద్రంలోని పత్తిబజార్‌లో ఉన్న జిల్లా పోలీస్‌ డాగ్‌ కెన్నెల్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కెన్నెల్‌లో ఉన్న రూప (ఎక్స్‌ప్లోజివ్‌), రుద్ర (ట్రాకర్‌), విక్కీ (నార్కోటిక్స్‌), లక్కీ (ఎక్స్‌ప్లోజివ్‌) ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాల ఆరోగ్య పరిస్థితి, ఆహార నిర్వహణ, వసతి, పరిశుభ్రత, శిక్షణ కార్యక్రమాలను సమీక్షించారు. ఆరోగ్యం, శిక్షణ, శుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ నిర్మూలనలో నార్కోటిక్స్‌ స్నిఫర్‌ డాగ్‌లను మరింత సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రతి జాగిలం వద్ద దాని పేరు, ప్రత్యేక నైపుణ్యం, జిల్లా, రాష్ట్రస్థాయిలో సాధించిన విజయాలు, అవార్డులు, సేవల వివరాలతో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్‌ జాగిలాలు శాఖకు అమూల్యమైన ఆస్తి అని పేర్కొన్నారు. హత్యలు, దొంగతనాలు, పేలుడు పదార్థాల గుర్తింపు, నార్కోటిక్స్‌ కేసులు, అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ గుర్తింపు వంటి క్లిష్టమైన కేసుల్లో జాగిలాలు నేరాల ఛేదనను వేగవంతం చేస్తున్నాయని తెలిపారు. జాగిలాలకు రోజూ నిర్దేశిత డైట్‌ చార్ట్‌ ప్రకారం నాణ్యమైన ఆహారం, శుభ్రమైన తాగునీరు, సమయానికి వైద్య పరీక్షలు, అవసరమైన టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ డాగ్‌ కెన్నెల్‌ ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ హుల్‌హక్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయభాస్కర్‌, ఎస్‌బీ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, ఆర్‌ ఎస్సై శివశంకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement