మద్దూరు(కోస్గి):ఇందిరమ్మ ఇళ్ల పథకం అమ లులో భాగంగా మద్దూరు మండలం ఖాజిపూర్‌లో చేపట్టిన గుడిసెల సర్వేను బుధవారం రాష్ట్ర విజిలెన్స్ బృందం పరిశీలించింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికచేసే లబ్ధిదారుల గుడిసెలను ఈఈ బలరాం, పీడీ శంకర్, డీవైఈఈ హరికృష్ణ సందర్శించి.. గుర్తించిన లబ్ధిదారుల నివాస పరిస్థితులు, అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా క్షేత్రస్థాయిలో సర్వే పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. వారి వెంట ఏఈ శాంతకుమార్, ఎంపీడీఓ భార్గవరాం, పంచాయతీ కార్యదర్శి షాజిల్, సర్పంచ్ సాయప్ప ఉన్నారు.
మీటర్ రీడింగ్
సులభతరం
నారాయణపేట: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కమ్) మీటర్ రీడింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ.. కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నూతన విధానంపై స్పాట్ బిల్లర్లు, మీటర్ రీడర్లకు డీఈటీ రాజునాయక్, ఏఈ మహేశ్‌గౌడ్ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముందుగా డేటా డౌన్‌లోడ్ చేసిన తర్వాత కొత్త ఆప్షన్‌లో ఈఆర్‌ఓ కోడ్ నమోదు చేయాలన్నారు. అనంతరం సెక్షన్ కోడ్, స్ట్రక్చర్ కోడ్, డీటీఆర్ కోడ్లను ఎంట్రీ చేయడం ద్వారా ఫీడర్ మ్యాపింగ్, స్ట్రక్చర్ మ్యాపింగ్ పూర్తవుతాయని తెలిపారు. అనంతరం యాప్‌లోని ఎడిట్ ఆప్షన్ ద్వారా వినియోగదారుల తాజా ఫోన్ నంబర్లను నమోదుచేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ విధానంతో బిల్లుల పెండింగ్ బకాయిల సమాచారం నేరుగా వినియోగదారుల ఫోన్లకు చేరడంతో పాటు బిల్లుల వసూళ్లు వేగవంతం అవుతాయని వారు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ డా.వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుశాఖ ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు లేదా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. ప్రజా జీవనానికి అంతరాయం కలిగించే లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అదే విధంగా సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా సంబంధిత పోలీసు అధికారుల అనుమతి పొందాలని సూచించారు.
జోగుళాంబ సన్నిధిలో
శృంగేరి పీఠాధిపతి
అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో శ్రీవిధుశేఖర భారతిస్వామి పూజలు నిర్వహించి.. మంగళహారతి సమర్పించారు. ఇదిలా ఉంటే.. శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రెండోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. గురువారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


