● ఏఓలు, ఏఈఓల పనితీరులో మార్పు రావాలి
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
నారాయణపేట:జిల్లాలో పంటల మార్పి డిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని.. ఈ ప్రక్రియలో ఏఈఓలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ వార్షిక కార్యాచరణపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రైతులు సాగుకు సిద్ధమయ్యే దశలోనే పంటల మార్పిడితో కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. అదే విధంగా భూసార పరీక్షల నిమిత్తం మట్టి నమూనాల సేకరణ, ఫార్మర్ రిజిస్ట్రీ, ఎరువులు, విత్తనాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సూచించారు. ఏఓలు, ఏఈఓల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని డీఏఓను ఆదేశించిన కలెక్టర్.. ఇకపై వారి హాజరు, క్షేత్ర పర్యటనలు, పనితీరుపై నెలకోసారి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పనితీరులో మార్పు కనిపించని అధికారుల నుంచి సంజాయిషీ కోరాలని స్పష్టంచేశారు. ఆయిల్‌పామ్ సాగు కేవలం ఉద్యానశాఖ బాధ్యత మాత్రమే కాదని.. వ్యవసాయశాఖ అధికారులు కూడా ఉద్యానశాఖతో సమన్వయం చేసుకుని జిల్లా లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం సాయిల్ హెల్త్ కార్డుల నవీకరణ పురోగతిని అధికారులతో తెలుసుకున్నారు. సమావేశంలో డీఏఓ సక్రియా నాయ క్, ఏడీఏ నగేశ్‌కుమార్ ఉన్నారు.
వందశాతం ఫలితాలు సాధించాలి..
నర్వ: యాస్పిరేషన్ బ్లాక్‌లో సూచికల ప్రకారం వందశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ సీహెచ్ ప్రి యాంక అన్నారు. నర్వ మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పాథర్చేడ్ ఉన్నత పాఠశాలలో అటల్ టింకర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు రూపొందించిన రిమోట్ ఎలక్ట్రికల్ కారు, త్రీడి ప్రింటర్, వాటర్ ప్లాంట్ తదితర ప్రదర్శనలను ఆమె తిలకించారు. విద్యార్థులు కలెక్టర్ పేరును త్రీడి ప్రింటర్‌తో ముద్రించి బహుమతిగా అందించగా.. అభినందనలు తెలిపారు. అనంతరం రాయికోడ్‌లో అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అదే విధంగా కేజీబీవీలో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ వెంకట్రాములు, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, యాస్పిరేషన్ బ్లాక్ కోఆర్డినేటర్ బాలాజీ, సర్పంచులు హన్మంతురెడ్డి, లింగమ్మ, శశికళ ఉన్నారు.


