ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరుపై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరుపై నిర్లక్ష్యం వద్దు

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

నారాయణపేట రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు విషయంలో నిర్లక్ష్యం వీడాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సోమిరెడ్డి అన్నారు. నారాయణపేట మండలం కోటకొండ పాఠశాలలో బుధవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అవకాశం మేరకు జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలను తెరిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. విద్యార్థుల నమోదుకు సంబంధించి యూడైస్‌ ప్లస్‌లో పూర్తిగా వెనకబడి ఉందని.. వారం రోజుల్లో పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్యానెల్‌ తనిఖీ బృందాల నియామకంలో ఆలస్యం లేకుండా వెంటనే పూర్తిచేసి.. పాఠశాలలకు పంపించాలన్నారు. భవిత కేంద్రాల్లోని పిల్లల సమగ్ర అభివృద్ధికి అడుగులు పడాలన్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన టీచర్లు, ఆయాల నియామకం ప్రక్రియను త్వరగా పూర్తిచేసి.. అడ్మిషన్ల సంఖ్య మరింత పెంచాలని తెలిపారు. నియామకాలపై ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం ఎంపిక చేయాలన్నారు. కాగా, మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెంటనే విద్యార్థుల చేరికపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. కేజీబీవీ కళాశాలలో సీట్ల భర్తీని వేగవంతం చేయాలన్నారు. అనంతరం కోటకొండకు నూతనంగా మంజూరైన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ భవన ఏర్పాటుకు అవసరమైన స్థలం, వసతి ఏర్పాట్లను ఆర్‌జేడీ పరిశీలించారు. డ్రోన్‌ ద్వారా వీడియోలు, సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు. కాగా, తొలిసారిగా నారాయణపేటకు వచ్చిన ఆర్‌జేడీని జిల్లా విద్యాశాఖ తరఫున శాలువాతో సత్కరించారు. జిల్లాలో టీచర్ల కొరత కారణంగా విద్యార్థులు నష్టం వాటిల్లుతుందని.. తాత్కాలికంగా వలంటీర్లను నియమించాలని తపస్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, సూపరింటెండెంట్‌ నర్సింహారెడ్డి, సెక్టోరియల్‌ అధికారులు విద్యాసాగర్‌, నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి, శ్రీనివాస్‌, తపస్‌ నాయకులు షేర్‌ కృష్ణారెడ్డి, నర్సింహ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement