బాలకార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

బాలకార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

నారాయణపేట: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత తనిఖీలు చేపట్టాలని ఎస్పీ వినీత్‌ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం నుంచి 31వ తేదీ వరకు జరిగే ఆపరేషన్‌ ముస్కాన్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లలోపు చిన్నారులతో పనులు చేయించడం చట్టవిరుద్ధ మని స్పష్టం చేశారు. బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే ప్రభుత్వ సంరక్షణ గృహాలకు తరలించే చర్యలు చేపడతామని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే నేరాన్ని పునరావృతం చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్‌ నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం పిల్లలను పనులకు పంపించి వారి భవిష్యత్‌ను దెబ్బ తీయవద్దని తల్లిదండ్రులను కోరారు. చదువు మాన్పించి పిల్లలను పనులకు పంపుతున్న తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు, బలవంతంగా పని చేయిస్తున్న చిన్నారులు, భిక్షాటన చేస్తున్న పిల్లలు, ఆశ్రయం అవసరమైన బాలలు లేదా తప్పిపోయిన వీధి బాలలు కనిపిస్తే వెంటనే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098, డయల్‌ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, ఆపరేషన్‌ ముస్కాన్‌ బృందం ఎస్‌ఐ బాలరాజు, డా. లక్ష్మీకాంత్‌, డీసీపీఓ కరిష్మా, ఎన్జీఓ ప్రతినిధి నరేష్‌, లేబర్‌ ఆఫీసర్‌ బాసిత్‌, ఎంఈఓ బాలాజీ, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధి నర్సింహ, సోషల్‌ వర్కర్‌ శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement