నారాయణపేట: బాలసదనం, వృద్ధాశ్రమాల్లో ఉన్న చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జూని యర్ సివిల్ న్యాయమూర్తి బి.సాయిమనోజ్ సూ చించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బారంబావి ప్రాంతంలో ఉన్న బాలసదనం,వృద్ధాశ్రమా న్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, రికార్డులు, సీసీ ఫుటేజీలను పరిశీలించి వృద్ధులు, చిన్నారుల సంఖ్య, వారికి అందుతున్న సౌక ర్యాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా పరిశీలించి రోజూ తాజా కూరగాయలు, నాణ్యమైన బియ్యంతో ఆహారం తయారు చేయాలని, తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి ఆదేశించారు. కార్యాలయ ఆదేశాల మేరకే ప్రవేశాలు జరుగుతున్నాయా.. సంబంధిత వ్యక్తులకే చిన్నారులు, వృద్ధులను అప్పగిస్తున్నారా అనే విషయాలను పరిశీలించారు. మందులు, టాబ్లెట్లు, సిరప్‌ల గడువు తేదీలను పరిశీలించి గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని సూచించారు. అనంతరం వృద్ధులు, చిన్నారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, ఇతర అవసరాలను తెలుసుకున్నారు. బిస్కెట్లు పంపిణీ చేసి బంధువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెడ్‌రూమ్‌లు, వాష్‌రూమ్‌లు ఎల్లప్పు డూ శుభ్రంగా ఉంచాలని, లైట్లు, ఫ్యాన్లు పనిచేసేలా చూడాలని సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకొని రిజిస్టర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.


