నారాయణపేట (మక్తల్): మక్తల్‌లో రూ.25 కోట్లతో ఆధునిక వసతులతో స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం ఇన్‌డోర్, ఔట్‌డోర్ పనులకు సంబంధించి పలు మార్పుచేర్పులు చేయించాలని అధికారులను ఆదేశించారు. పురుషులు, మహిళా క్రీడాకారులకు వేర్వేరు గదులు, విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల కళాశాల భవనం పెచ్చులూడి విద్యార్థులపై పడి గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి ఇతర భవనంలోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 16 వార్డుల్లో సీసీ రోడ్డు పనులను పరిశీలించి నాణ్యత పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో వంతెనల నిర్మాణానికి రూ.50 కోట్లకుపైగా మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రామాలు అభివృద్ధి దిశలో పయనించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్, కట్ట సురేష్, హన్మంతు, డీవైఎస్‌ఓ వెంకటేష్, ఉపేందర్ పాల్గొన్నారు.


