పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

నారాయణపేట: జిల్లా ప్రజలకు అత్యాధునిక పాలనా సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ (ఐడీఓసీ) నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడకుండా పూర్తి చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం సింగారం మలుపు సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఏఓ చాంబర్లు, సమావేశ మందిరం సందర్శించి నిర్మాణ నాణ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిటికీలు, తలుపుల బిగింపు, వైరింగ్‌, శానిటరీ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మీటింగ్‌ హాల్‌లో ప్రొజెక్టర్‌, సౌండ్‌ సిస్టం, ఇంటీరియర్‌ డిజైన్‌ను ఇతర జిల్లాల కలెక్టరేట్లను అధ్యయనం చేసి ఉత్తమ నమూనాలను అమలు చేయాలని చెప్పారు. భవనం వెనుక భాగంలో ప్రత్యేక రహదారి, గేటు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవనం వెలుపల హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఉండటంతో హెలీప్యాడ్‌ ఏర్పాటు సాధ్యం కాదని అధికారులు వివరించడంతో ఆ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్‌కు వినియోగించాలని నిర్ణయించారు. పార్కింగ్‌ షెడ్‌పై మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే అవకాశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్‌ బంగ్లా వెనుక రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా సమాఖ్య భవనం పనులను పరిశీలించారు. అక్కడ హెలీప్యాడ్‌ ఏర్పాటుకు అవకాశం పరిశీలించాలని, భవన ఆవరణలో ఓ వైపు రహదారి, మిగతా ప్రాంతంలో పచ్చదనం పెంపొందించేలా అభివృద్ధి చేయాలని డీఆర్డీఓ వెంకట్రాములుకు సూచించారు. ఆమె వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, డీఈ రాములు, పీఆర్‌ ఈఈ అశోక్‌కుమార్‌, ఆయా శాఖల ఏఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

వేగంగా పంపిణీ చేయాలి..

ఊట్కూర్‌: జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఎన్యూమరేషన్‌ పత్రాలను బీఎల్వోలు, రెవెన్యూ అఽధికారులు వేగంగా పంపిణీ చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని కార్గిల్‌ చౌరస్తా, గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న ఇళ్లకు వెళ్లి బీఎల్వోలతో కలిసి ఎన్యూమరేషన్‌ పత్రాలను పంపిణీ చేసి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఇంటింటికి వచ్చే బీఎల్వోలకు సహకరించి పత్రాలు పూరించి ఇవ్వాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎంఈఓ మాధవి, డీపీఆర్వో రషీద్‌, ఆర్‌ఐ కృష్ణారెడ్డి, కోరం శివరాజ్‌రెడ్డి, వెంకటేశ్వరమ్మ, సునీత తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement