● నారాయణపేటలో అత్యధికంగా
16.8 మి.మీ. వర్షపాతం నమోదు
నారాయణపేట: జిల్లాలో గురువారం పలుచోట్ల చిరు జల్లులు, తేలికపాటి వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా 35.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జిల్లా సగటు వర్షపాతం 2.72 మిల్లీమీటర్లు నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే నారాయణపేటలో అత్యధికంగా 16.8 మి.మీ, కృష్ణాలో 10.8 మి.మీ., గుండుమల్‌లో 3.0 మి.మీ., ధన్వాడలో 2.4 మి.మీ., ఊట్కూర్‌లో 2.0 మి.మీ., మాగనూర్‌లో 0.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు దామరగిద్ద, మక్తల్, నర్వ, మరికల్, మద్దూర్, కోస్గి, కొత్తపల్లి మండలాల్లో వర్షం కురవలేదు.
సర్‌పై అపోహలు వద్దు: కలెక్టర్
నారాయణపేట రూరల్: ఓటరు జాబితాల కచ్చితత్వం కోసమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపడుతున్నామని.. ఓట్లు తొలగిస్తారనే అపోహలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. మండలంలోని జాజాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామానికి చెందిన బసుదె కిష్టప్ప ఇంటికెళ్లి స్వయంగా ఫారాలు అందజేశారు. అంతేగాకుండా ఫారాలను ఎలా నింపాలో యజమానికి అర్థమయ్యేలా వివరించారు. నింపిన ఫారాలను రెండు, మూడురోజుల్లో తిరిగి బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. రెండురోజుల్లో ఫారాల పంపిణీ పూర్తి చేయాలని బీఎల్వోలను ఆదేశించారు. ఫారాలు ఇచ్చేటప్పుడే ఓటర్ల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం బసుదె కిష్టప్ప ఇంట్లో మగ్గంపై నేత కార్మికులు నేస్తున్న నారాయణపేట కాటన్ చీరలను ఆమె ఆసక్తిగా తిలకించారు. చీర నేసే మొత్తం ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న చీరలను పరిశీలించి మూడింటిని కొనుగోలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగీత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రెండ్రోజులకే నిలిచిన
నీటి పంపింగ్
మరికల్: జూరాల నుంచి కోయిల్‌సాగర్‌కు నీటి పంపింగ్ రెండురోజులకే నిలిచిపోయింది. గత వారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చిన్నచింతకుంట మండలం ఉంద్యాల స్టేజీ–1 దగ్గర జూరాల నీటి పంపింగ్‌ను ప్రారంభించి రెండురోజుల పాటు పర్ధీపూర్ చెరువుకు సరఫరా చేశారు. పర్ధీపూర్ చెరువు నిండి కోయిల్‌సాగర్‌కు నీళ్లు రావాలి. ఆ చెరువు నిండటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఎల్‌నినో ప్రభావంతో ఎగువన కూడా భారీ వర్షాలు కురువకపోవడంతో జూరాలకు వరద రావడం లేదు. దీంతో జూరాలలో నీరు అందకపోవడంతో రెండురోజులు మాత్రమే నీటిపంపింగ్ చేసి నిలిపివేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే తప్పా ఈ ఏడాది కోయిల్‌సాగర్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం కోయిల్‌సాగర్‌లో పది అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. గతేడాది ఇదివరకే నీటిపంపింగ్ ప్రారంభించారు.
రేపు జిల్లా ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: నిజామాబాద్ జిల్లాలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు జరగనున్న సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికను ఈనెల 28వ తేదీన ఉదయం 8 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్‌స్టేడియంలో నిర్వహిస్తునట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే బాలికలు ఒరిజినల్ ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9396439663 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


