మత్తుకు బానిసైతే భవిష్యత్‌ అంధకారం | - | Sakshi
Sakshi News home page

మత్తుకు బానిసైతే భవిష్యత్‌ అంధకారం

Jun 27 2026 1:31 AM | Updated on Jun 27 2026 1:31 AM

నారాయణపేట: డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలని, యువత యాంటీ డ్రగ్‌ సోల్జర్స్‌గా పని చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుంచి సత్యనారాయణచౌరస్తా వరకు కొనసాగింది. అక్కడే మానవహారంగా ఏర్పడి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, స్నేహితులు, ఎంజాయ్‌ పేరుతో సమయాన్ని వృథా చేస్తే కష్టకాలంలో ఎవరూ అండగా ఉండరని చెప్పారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా మంచి భవిష్యత్‌ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ అనేవి టెరర్రిస్టుల కంటే ప్రమాదకరమైనవన్నారు. యువత అధికంగా ఉన్న భారతదేశాన్ని బలహీనపర్చేందుకు డ్రగ్స్‌ను ఆయుధంగా ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు అవసరం లేదని.. యువతను వ్యసనాలకు బానిస చేస్తే చాలని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే విద్య, ఉద్యోగం, జీవితం పూర్తిగా దెబ్బతింటుందని, అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి యువకుడు యాంటీ నార్కోటిక్‌ డ్రగ్‌ వారియర్‌గా మారాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 1908 లేదా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ హుల్‌హక్‌, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్‌, ఎకై ్సజ్‌ సీఐ అశోక్‌కుమార్‌, ఆర్‌ఐ విజయభాస్కర్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రి, కృష్ణచైతన్య, ఎకై ్సజ్‌ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement