భక్తిశ్రద్ధలతో మొహర్రం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో మొహర్రం

Jun 27 2026 1:31 AM | Updated on Jun 27 2026 1:31 AM

డోలారోహణ కార్యక్రమానికి తరలివచ్చిన జనం

పీర్ల వద్ద మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

ఊట్కూర్‌లో ఊరేగుతున్న హసేన్‌, హుసేన్‌ పీర్లు

ఊట్కూర్‌: మతసామరస్యానికి ప్రతీకై న మొహర్రంను పట్టణంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక పెద్దపీర్ల మసీద్‌లో హసేన్‌, హుసేన్‌ పీర్లను పది రోజుల కిందట ప్రతిష్టించారు. నవమి సవారి సందర్భంగా తెల్లవారుజామున పీర్లను గ్రామ పురవీధుల్లో ఊరేగించి ఉదయం 9 గంటలకు తిరిగి మసీద్‌కు తీసుకొచ్చారు. దశమి సవారి సందర్భంగా తిరిగి సాయంత్రం సవారి ప్రారంభమై గ్రామంలో ఊరేగిస్తూ నిమజ్జనానికి పెద్దచెరువుకు తీసుకెళ్లారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో మహిళలు బొడ్డెమ్మలు, యువకులు డప్పులు కొడుతూ అలయ్‌ ఆడారు. కొందరు మేకలు, గొర్రెలతో కుందూర్‌లు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మొహర్రం సందర్భంగా చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేశారు. ముంబై, పూణె, సోలాపూర్‌, బెంగళూర్‌, హైదరాబాద్‌ తదితర పట్టణాల నుంచి అధికమంది తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

కనులపండుగగా డోలారోహణం..

మొహర్రంలో భాగంగా దేవినగర్‌లో అనాదిగా వస్తున్న డోలారోహణ కార్యక్రమం కనులపండుగా నిర్వహిచారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో ఆరెకటిక కులానికి చెందిన శిశువును వేయగా హసేన్‌, హుసేన్‌ పీర్లు ఊయలను ఊపి బాలుడికి నామకరణం చేశారు. వేలాదిమంది భక్తులు పాల్గొని చప్పట్లు కొట్టి శిశువును దీవించారు. ఆరెకటికె కుటుంబాలకు చెందిన మగ శిశువుకు నామకరణం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకలను తిలకించేందుకు వేలాదిమంది భక్తులు హాజరయ్యారు.

మొక్కులు తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే..

మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హసేన్‌, హుసేన్‌ పీర్లకు దట్టీలు, చక్కెర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మసీద్‌ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది. నాయకులు లక్ష్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి, కోరం శివరాజ్‌రెడ్డి, ఆనంద్‌, తరుణ్‌, మోనప్ప, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement