తప్పిపోయిన బాలుడు.. 11 ఏళ్లకు తల్లిదండ్రుల చెంతకు | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన బాలుడు.. 11 ఏళ్లకు తల్లిదండ్రుల చెంతకు

Jun 27 2026 1:31 AM | Updated on Jun 27 2026 1:31 AM

ఊట్కూర్‌: తప్పిపోయిన ఓ మానసిక దివ్యాంగుడు 11 ఏళ్ల తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తల్లిదండ్రుల చెంతకు చేరిన ఘటన మండలంలోని తిప్రాస్‌పల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుర్వ భీమప్ప, ఎల్లమ్మకు ముగ్గురు మగ పిల్లలు. చిన్నవాడైన హన్మంతు (13) బుద్ధిమాంద్యంతో ఇంటి దగ్గర ఉండేవాడు. 11 ఏళ్ల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడి ఆచూకీ కోసం ఎంత వెదికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం చైన్నెలోని ‘మనసు‘ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సర్పంచ్‌ విజయలక్ష్మి నర్సింహకు ఫోన్‌ చేసి గ్రామానికి చెందిన ఓ మా మానసిక దివ్యాంగుడు తమ ఆశ్రమంలో చికిత్స పొందుతున్నారని వాట్సప్‌లో ఫొటో పంపారు. కుటుంబ సభ్యులు గుర్తించడంతో గ్రామస్తులతో కలిసి చైన్నెకి వెళ్లారు. యువకుడు తల్లిదండ్రులను గుర్తించడంతో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వారికి అప్పగించారు. 2015, సెప్టెంబర్‌ 29న తమిళనాడులోని చెంగల్పట్టు రైల్వేస్టేషన్‌లో 13 ఏళ్ల హన్మంతు తిరుగుతుండగా.. స్వచ్ఛంద సంస్థ వారు గమనించి చైన్నెలోని ఆశ్రమంలో చేర్పించి చికిత్స అందించారు. నాలుగు రోజుల కిందట తన గ్రామం తిప్రాస్‌పల్లి, మక్తల్‌ అని చెప్పడంతో సంస్థ సభ్యులు గూగుల్‌ సాయంతో సర్పంచ్‌కు సమాచారం అందించారు. 11 ఏళ్ల కిందట తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement