జిల్లావ్యాప్తంగా 45 ఏఈఓ పోస్టులు ఖాళీ
● మొత్తం 77 క్లస్టర్లు.. 32 మంది విధుల్లో...
● ఒక్కొక్కరికి 6 నుంచి 8 గ్రామాలు అదనం
● పని ఒత్తిడికి గురవుతున్న అధికారులు
–8లో u
మరికల్: వానాకాలం పంటల సాగు ప్రారంభమైంది. మేలైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు పలు రకాల ప్రభుత్వ పథకాలను అన్నదాతలకు చేరువ చేయడంలో వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్ర ఎంతో కీలకం. జిల్లాలోని పలుచోట్ల ఆయా పోస్టులు ఖాళీగా ఉండటంతో రైతులకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. అన్నదాతలు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే ఏఈఓలను పూర్తిస్థాయిలో నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో మొత్తం 77 క్లస్టర్లు ఉండగా.. కేవలం 32 మంది ఏఈఓలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా క్లస్టర్లలో లేకపోవటంతో పలురకాల సేవలు రైతులకు సకాలంలో అందడం లేదు.
జిల్లాలో ఇలా..
జిల్లా సాగు విస్తీర్ణం 4.34 లక్షల ఎకరాలు ఉండగా.. 1.92 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో ఏటా 4లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు వివిధ రకా ల పంటలు సాగు చేస్తున్నారు. రైతులకు వానాకాలం, యాసంగి సీజన్‌లో పంటల సాగుపై సలహా లు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం 5 వేల ఎక రాలకు ఓ క్లస్టర్‌గా విభజించి జిల్లావ్యాప్తంగా 77 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతువేదికలు నిర్మించింది. కాగా జిల్లాలో ప్రస్తుతం 32 మంది ఏఈఓలు మా త్రమే విధులు నిర్వర్తిస్తుండగా.. 45 ఖాళీలున్నాయి. ఆయా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఒక్కో ఏఈఓకు 6 నుంచి 8 గ్రామాల చొప్పున ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో వారు తమ విధులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. యూరియా యాప్, పంటలు పండిన సమయంలో 8 గ్రామాల రైతులు ఒక్కసారిగా రావడంతో తాకిడిని తట్టుకోలేక ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు.
ఏఈఓల విధులు..
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫర్టిలైజర్ యాప్ విడుదల చేసింది. రైతులు పట్టాదారు పాసు పుస్తకాలను ఏఈఓల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్థానికంగా ఏఈఓ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ కూడా రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలి.
క్రాప్ బుకింగ్‌కు సైతం విస్తరణాధికారి లేకుంటే ఇబ్బందే. మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలు చేతికొచ్చిన తర్వాత మార్క్‌ఫెడ్, ఐకేపీ, సహకార సంఘాలు, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలి.
భారత పత్తి సంస్థ(సీసీఐ) కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా రైతుల వివరాలు ఆన్‌లైన్ చేసి ఉండాలి.
రైతుభరోసా దరఖాస్తులు ఆలస్యమైనా, దరఖాస్తు చేయలేకపోయినా ఆ కుటుంబం ప్రభుత్వం అందించే రూ.5 లక్షల బీమా సాయం కోల్పోతుంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతుభరోసా నిధుల విడుదలలో ఇబ్బందులు పరిష్కరించే బాధ్యత ఏఈఓలపైనే ఉంది.


