● రొటీన్ పాలనకు స్వస్తి పలకండి
● ప్రభుత్వ ఆలోచనలకు
అనుగుణంగా పని చేయండి
● జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన
నారాయణపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కేవలం ఒక ప్రత్యేక కార్యక్రమం కాదని.. ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే ఫలితాల ఆధారిత పరిపాలన విధానమని రాష్ట్ర కార్మిక, ఉపాఽ ది శిక్షణ, కర్మాగారాలశాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా చివరి లబ్ధిదారుడి ఇంటి గుమ్మం వరకు చేరేలా అధికారులు పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పాలనకు అసలైన ప్రమాణమని పేర్కొన్నారు. అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజలతో మమేకమై పని చేయాలని సూచించారు. ప్రతి శాఖ అధికారి తమ రోజువారీ విధులకు మాత్రమే పరిమితం కాకుండా.. ఇతర జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి జిల్లాలో అమలు చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు గరిష్ట ప్రయోజనం కలిగించాలని కోరారు.
ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించాలి..
బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పెంచాలని, ఆహార భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి వెంటనే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎనీమియా నిర్మూలనకు చర్యలు చేపట్టాలని, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలని కోరారు. సంప్రదాయ పంటలతో పాటు పండ్లు, కూరగాయలు వంటి ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నందున విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో పాటు అన్ని శాఖల అధికారులను అభినందించారు. ఇదే పనితీరును భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని కోరారు.


