నేరాల నియంత్రణకు కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు కఠిన చర్యలు

Jun 24 2026 12:59 AM | Updated on Jun 24 2026 12:59 AM

నారాయణపేట: జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీస్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య ఆదేశించారు. నారాయణపేట సర్కిల్‌ పరిధిలోని పోలీసు అధికారులతో మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్‌ రివ్యూ సమావేశంలో నేర నియంత్రణకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు నుంచి చార్జ్‌షీట్‌ దాఖలు వరకు ప్రతి దశలో నాణ్యత, పారదర్శకత, సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి పోలీసు అధికారి స్టేషన్‌ నిర్వహణతో పాటు దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పెండింగ్‌ కేసులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక సమీక్ష

అండర్‌ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా గ్రేవ్‌, నాన్‌–గ్రేవ్‌ కేసుల దర్యాప్తు పురోగతిని ఒక్కో అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఆలస్యం జరుగుతోంది? ఏ కేసుల్లో ఆధారాలు సేకరించాల్సి ఉంది? ఏ కేసులు త్వరగా పూర్తి చేయవచ్చు? వంటి అంశాలపై అధికారులతో చర్చించి స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు.

దర్యాప్తే కీలకం

కేసుల్లో శిక్షల శాతం పెరగాలంటే దర్యాప్తులో స్పష్టత అత్యంత కీలకమని డీఎస్పీ పేర్కొన్నారు. కేసు ప్రారంభ దశలోనే స్పష్టమైన ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ రూపొందించి, ఘటన స్థల పరిశీలన, శాసీ్త్రయ ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్‌ ఆధారాల భద్రత వంటి అంశాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. దర్యాప్తు మొత్తం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ ప్రకారం సాగాలన్నారు.

60 రోజుల్లో చార్జ్‌షీట్‌

పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదయ్యే కేసులు, ఇతర గ్రేవ్‌ నేరాల్లో ఎలాంటి జాప్యం లేకుండా 60 రోజుల్లోపు చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని డీఎస్పీ స్పష్టం చేశారు. దీని ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అక్రమాలపై ఉక్కుపాదం

జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, గంజాయి, గుట్కా విక్రయాలు, పేకాట, సైబర్‌ నేరాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. ఇలాంటి నేరాల్లో ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాచార వ్యవస్థను బలోపేతం చేసి, ఇంటెలిజెన్స్‌ ఆధారంగా దాడులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో సీఐ శివశంకర్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సతీష్‌రెడ్డి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement