నారాయణపేట: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన విత్తన మేళాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని జాజాపూర్ రైతువేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను సర్పంచ్ సంగీతతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 60 రైతువేదికల్లో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు విత్తన మేళాలు కొనసాగుతాయన్నారు. వానాకాలం సీజన్‌కు అవసరమైన విత్తనాలను రైతులకు ఒకేచోట అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో జిల్లాలో రైతువేదికల వద్ద విత్తనమేళాలు ఏర్పాటు చేశామన్నారు. వరితో పాటు ఉద్యాన పంటల సాగుపైనా రైతులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో సీతాఫలం, మామిడి వంటి తోటల సాగుకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. అంతర్ పంటలు, ఆయిల్‌పాం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అనంతరం యూరియా ఆన్‌లైన్ యాప్‌ను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, ఏఓ బాలదినకర్ తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ను విజయవంతం చేయాలి
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ అత్యంత కీలకమని, ఈ ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో నియోజకవర్గ స్థాయి బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు సర్ అవగాహ న కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు సవరణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంలో బూత్ స్థాయి అధికారులదే కీలక బాధ్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, డీఆర్‌ఓ రాజేశ్వరి, ఆర్డీఓ రమేష్, కలెక్టరేట్ ఏఓ అనిల్, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తొలి విడతలో 60 కేంద్రాల్లో
ప్రారంభం
జూన్ 23 నుంచి 30 వరకు నిర్వహణ
జాజాపూర్‌లో విత్తన మేళా
ప్రారంభించిన కలెక్టర్ సీహెచ్ ప్రియాంక


