అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం : బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం : బీఆర్‌ఎస్‌

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

మరికల్‌: ఇళ్లు ఖాళీ చేయాలని ఇచ్చిన కోర్టు నోటీసులకు ఎవరూ అధైర్యపడొద్దని.. మీకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేంధర్‌రెడ్డి బాధితులకు భరోసానిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని గజలమ్మగడ్డ కాలనీలో ఆయన పర్యటించి బాధితులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారి సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. విక్రయించిన స్థలాలకు 42 ఏళ్ల తర్వాత తాము వారసులమంటూ నోటీసులిస్తే ఏం కాదన్నారు. మండల కేంద్రంలో 75 శాతం ఇళ్లు వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్నవేనని.. వాటికి గ్రామపంచాయతీ అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. అప్పటి నుంచి పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నారని.. ఇప్పుడు వచ్చి కోర్టు నోటీసులు ఇప్పించి కేసులు నమోదు చేస్తామంటే ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం ఏ కోర్టుకు వెళ్లినా న్యాయం మీ దిక్కు ఉందని, మీరే గెలుస్తారని భరోసానిచ్చారు. నోటీసులు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఇంత వరకు రైతు భరోసా తీసుకున్నట్లు తెలిసిందని.. వారి మీద చీటింగ్‌ కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఆపదొస్తే వెంట ఉండి న్యాయం కోసం పోరాడుతానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ వైస్‌ ఎంపీపీ రవి, పార్టీ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య, కృష్ణారెడ్డి, శేఖర్‌, రామస్వామి, కర్లి కృష్ణయ్య, మతిన్‌, అనంత్‌రెడ్డి, నర్సింహులు, రఘు తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రిసీతక్క పర్యటన

కందనూలు: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సోమవారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు జిల్లాలోని తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ దుండుభీ వాగుపై రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవన్‌ నిర్మాణ ప్రణాళికలు పరిశీలించనున్నారు. అలాగే తెలంగాణ పోలీస్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో భరోసా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.

ఉత్సాహంగా

నెట్‌బాల్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: తెలంగాణ అమెచ్యూర్‌ నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి సీనియర్‌ ఫాస్ట్‌–5 పురుష, మహిళా నెట్‌బాల్‌ ఎంపికలు నిర్వహించినట్లు సంయుక్త కార్యదర్శి సయ్యద్‌ అంజద్‌అలీ తెలిపారు. ఈ ఎంపికలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 మందికిపైగా క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఎంపికయ్యే జట్లు పుదుచ్చేరిలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే సీనియర్‌ ఫాస్ట్‌–5 జాతీయ స్థాయి నెట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొంటాయని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్‌ క్రీడాకారులు హబీబ్‌ఖాన్‌, మహ్మద్‌ ఖాజా అక్రముద్దీన్‌ పాల్గొన్నారు.

జూరాలకు నిలిచిన ఇన్‌ఫ్లో

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో 15 రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్‌ఫ్లో ఆదివారం పూర్తి గా తగ్గింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులతో పంపింగ్‌ చేస్తుండగా.. ఒక పంపును నిలిపేసి కేవలం ఒక పంపు ద్వారా నీటి పంపింగ్‌ చేస్తున్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 749 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 569 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 873 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 537 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 740 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.061 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement