● బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పార్టీలు ప్రజలను మోసం చేశాయి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
నారాయణపేట: ప్రధాని మోదీ 12 ఏళ్లలో సాధించిన విజయాలను గడప గడపకు తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళన్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2014కు ముందు దేశంలో అనేక భారీ అవినీతి కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. కాంగ్రెస్ పాలనలో రూ.వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. భారత్‌లో రేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తలెత్తలేదన్నారు. ప్రధానమంత్రి జనధన్ యోజన ద్వారా కోట్లాది మందిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చారని.. 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నారని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. నేడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, నంబర్–1 స్థానంలో నిలిచే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. దేశ భద్రతలో రాజీ లేకుండా ప్రతి ఉగ్రదాడికి సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యల ద్వారా గట్టి సమాధానం ఇస్తోందని పేర్కొన్నారు. 12 ఏళ్లులో తెలంగాణకు రూ.13 లక్షల కోట్లకు పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం అందించిందని.. రాష్ట్రాలకు పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచి సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, కోచ్ ఫ్యాక్టరీ, రహదారులు, హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు తదితర అనేక రంగాల్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ మద్దతునిచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. స్థానిక పుర కౌన్సిల్‌లో బీజేపీ ప్రతినిధిని గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనకు బీజేపీకి ఘనమైన మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీ కూడా మత రాజకీయాలతో శాశ్వతంగా మనుగడ సాగించలేదన్నారు. సదస్సులో పుర చైర్‌పర్సన్ కొండా శ్వేత, వైస్ చైర్‌పర్సన్ మంజుల, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ, కొండయ్య, రతంగ్ పాండురెడ్డి, పగుడాకుల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు అమర్ దీక్షిత్, శ్రీనివాసులు, రఘురామయ్యగౌడ్, లక్ష్మీ శ్యాంసుందర్, బలరాంరెడ్డి, భాస్కర్, ప్రజాప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు.


