నారాయణపేట: భారత్ ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని.. యోగాతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎస్పీ డా. వినీత్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువు సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శిక్షకుడు కుమ్మరి నర్సింహులు యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ప్రదర్శించి ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకున్నారని తెలిపారు. రోజూ యోగాసనాలు, ప్రాణాయామం చేయడంతో శారీరక దృఢత్వంతో పాటు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. సిబ్బంది ప్రజల భద్రతకు రేయింబవళ్లు పనిచేస్తూ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారని.. యోగా, ధ్యానం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని తెలిపారు. రోజూ కొంత సమయాన్ని యోగ సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులను మరింత సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఎన్.లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, రాంలాల్, భగవంత్‌రెడ్డి, ఆర్‌ఐ విజయభాస్కర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, విక్రమ్, రమేష్, విజయ్ భాస్కర్, సునీత, శివశంకర్, శిరీష, పేట సర్కిల్ పోలీసు సిబ్బంది, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


