భారత్‌మాల పనుల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

భారత్‌మాల పనుల అడ్డగింత

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

మరికల్‌: రోడ్డు విస్తీర్ణంలో ప్లాట్లు కోల్పోయిన తమకు నష్ట పరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని గురువారం భారత్‌మాల నిర్వాసితులు పనులు అడ్డుకున్నారు. గురువారం పట్టణ శివారులోని సర్వేనంబర్‌ 669, 672లో చెట్ల తొలగింపు పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బాధితులు చెట్లను తొలగిస్తున్న పొక్లెయిన్‌ను అడ్డుకొని అధికారులు తమకు నష్ట పరిహారం ఇచ్చే వరకు పనులు చేసేది లేదని తిప్పి పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిహారం కోసం ఏళ్ల తరబడి ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో బాధితులు నరేష్‌, పద్మమ్మ, అనిత, రాజు, బాలమ్మ, కుర్మన్న, రత్నాచారి, శంకరప్ప, రేణుక, హన్మంత్‌రెడ్డి, అనిత, బుడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.

విధేయులకే కీలక

పదవులు: కాంగ్రెస్‌

నారాయణపేట: కష్టకాలంలో అండగా నిలిచి జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకే పార్టీలో కీలక పదవులు దక్కుతాయని డీసీసీ మాజీ అధ్యక్షుడు, నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కుంభం శివకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల రవీందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అంకితభావంతో పనిచేసే నాయకత్వానికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అరెస్టులు, కేసులు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీని వీడలేదని, అలాంటి విధేయులను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మక్తల్‌–కొడంగల్‌–నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని వేగంగా అమలు చేస్తోందని, రైతుల సమ్మతితోనే భూ సేకరణ చేపట్టి ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యంగా పరిష్కరిస్తోందన్నారు. పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని, జిల్లాలో ఇప్పటికే యువ నాయకులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. త్వరలోనే పార్టీకి కట్టుబడి పనిచేసిన మరికొందరు నాయకులు, కార్యకర్తలకు వివిధ పదవులు ఇస్తామని, రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నాయకత్వంలో అన్నిరంగాల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివారెడ్డి, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంత్‌కుమార్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బండి వేణు, డా. గీత విశ్వనాథ్‌, దామరగిద్ద మండల అధ్యక్షుడు బర్ల ఆనంద్‌కుమార్‌, నరేష్‌ బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

న్యాయవాదుల

విధుల బహిష్కరణ

నారాయణపేట ఎడ్యుకేషన్‌: మహబూబ్‌నగర్‌లో న్యాయవాది వి.నరేందర్‌నాయక్‌పై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ నారాయణపేట బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. గురువారం కోర్టు ఎదుట నిరసన తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకొచ్చినప్పటికీ మహబూబ్‌నగర్‌ రూరల్‌ ఎస్‌ఐ న్యాయవాదిపై అక్రమ కేసు నమోదు చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేని పేర్కొన్నారు. త్వరగా అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు నందూనామాజీ, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement