నారాయణపేట: జిల్లాను బాల్య వివాహాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెనన్స్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్య వివాహాల నిషేధ చట్టం–2006, పోక్సో చట్టం–2012పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్, ఎస్పీ డా. వినీత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నా భవిష్యత్తు–నా సంకల్పం నినాదంతో జిల్లాలో గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ, మహిళా చట్టాల సమర్థ అమలుతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆడపిల్లలు చదువు పూర్తి చేసుకొని చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాతే వివాహం చేసుకునేలా సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. జిల్లాపై ఉన్న బాల్య వివాహాల ముద్రను అందరి భాగస్వామ్యంతో చెరిపివేయవచ్చని పేర్కొన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థాయి కమిటీలపై ఉందని, సమాచారం దాచినా లేదా ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇకపై జిల్లాలోని ప్రతి గ్రామంలో బాల్య వివాహాల నిరోధక చట్టంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరిగినట్లు రుజువైతే సంబంధిత క్షేత్రస్థాయి అధికారి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అడ్డుకున్న సర్పంచులకు రాష్ట్రస్థాయి ఉత్తమ సర్పంచి అవార్డు అందించేలా కృషి చేస్తానని ప్రకటించారు. ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా నేటికీ కేసులు నమోదు కావడం ఆందోళనకరమన్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. డ్రాప్‌అవుట్ బాలికలను తిరిగి పాఠశాలల్లో చేర్పించి ఈ దురాచారాన్ని నిర్మూలించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ వెంకట్రాములు, ఆర్డీఓ రమేష్, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్‌కుమార్, డీసీపీఓ కరిష్మా తదితరులు పాల్గొన్నారు.
ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ప్రారంభం
జిల్లాకేంద్రం సమీపంలోని సింగారం మలుపు వద్ద కొత్తగా నిర్మించిన ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఎక్లాస్‌పూర్ ఎకో పార్క్‌లో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాస్‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 88 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఎక్లాస్‌పూర్ ఎకో పార్క్ జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. వనమహోత్సవం సందర్భంగా ప్రారంభించిన జంగిల్ సఫారీ వాహనం ద్వారా సందర్శకులు అడవి అందాలను ఆస్వాదించడంతో పాటు అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ శివ్ ఆశిష్‌సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి గణేష్, ఎఫ్‌ఆర్‌ఓ కమలోద్దీన్, ప్రత్యేక అధికారులు, బీట్ అధికారులు, సింగారం సర్పంచ్ నాగిరెడ్డి, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


