సీఎం చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సీఎం చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

కోస్గి రూరల్‌: గుండుమాల్‌ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయం ప్రారంభం, నాభి శిల విగ్రహ ప్రతిష్ఠాపన కరపత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం తన నివాసంలో ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోస్గిలోని పార్టీ కార్యాలయంలో అవిష్కరించారు. ఈ నెల 16 న అగ్ని ప్రతిష్ఠాపనం, నవగ్రహలు, 17న విగ్రహాలకు మహోన్నవనం, ధాన్యాదివాసం, 18న విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణప్రతిష్ఠ చేపట్టనున్నారు. గుండుమల్‌ ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్‌రావు, జాజిం వెంకటేష్‌, అంజియాదవ్‌ ఉన్నారు.

ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి

నారాయణపేట: ప్రజలకు పారదర్శక, బాధ్యతాయుత సేవలు అందిస్తూ పోలీస్‌శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని ఎస్పీ డా. వినీత్‌ సూచించారు. ఇటీవల దామరగిద్ద, కోస్గి పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన నరేష్‌, పురుషోత్తం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. విధులను అంకితభావంతో నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు సత్వరం పరిష్కరించేలా పని చేయాలని, గ్రామాలు, పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, నేరాలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

చురుగ్గా రెడ్‌క్రాస్‌

సభ్యత్వ నమోదు

నారాయణపేట: భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.శ్రీను సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ప్రముఖ న్యాయవాది రఘువీర్‌యాదవ్‌కు రెడ్‌క్రాస్‌ సభ్యత్వాన్ని అందజేసి మాట్లాడారు. జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, ఉద్యోగులు రెడ్‌క్రాస్‌ సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వైఫరీత్యాలు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రెడ్‌క్రాస్‌ అందిస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఉపయోగకరమన్నారు. జిల్లాలో రెడ్‌క్రాస్‌ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. సేవాభావం ఉన్న ప్రతి ఒక్కరూ రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేరి సమాజ సేవలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

పీయూ

డిగ్రీ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్‌లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్‌లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్‌లో 44.09, ఐదో సెమిస్టర్‌లో 66.97, ఆరో సెమిస్టర్‌లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement