రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు..

నారాయణపేట: జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి శాశ్వత భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెనన్స్‌ హాల్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే, పోలీసు, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల సమీపంలోని రహదారుల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు, జంక్షన్ల వద్ద హెచ్చరిక బోర్డులు, కల్వర్టుల వద్ద రేడియం స్టిక్కర్లు అంటించాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాద హెచ్చరిక బోర్డులు, రంబుల్‌ స్ట్రిప్స్‌, డ్రైవ్‌ స్లో సూచికలు ఏర్పాటు చేయాలని చెప్పారు. స్థానిక బస్టాండ్‌ వద్ద పండ్ల బండ్లతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని, తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. అప్పంపల్లి సమీపంలోని ఇరుకై న కల్వర్టుల వద్ద ప్రమాద అవకాశాలు అధికంగా ఉన్నందున ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కోస్గి బస్టాండ్‌ వద్ద జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు భద్రత కమిటీ సమావేశాలు ప్రతి నెల నిర్వహించి ప్రమాదాల నివారణ చర్యల పురోగతిని సమీక్షించాలని సూచించారు. సమావేశంలో ఆర్టీఏ సభ్యుడు పోషల్‌ రాజేష్‌, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్ర మోహన్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకట్రాములు, నేషనల్‌ హైవే డిప్యూటీ ఈఈ మహ్మద్‌ సుభాన్‌, ఆర్టీఓ మున్ని తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అర్జీదారుల వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, డీఆర్‌ఓ రాజేశ్వరికి వివరించి అర్జీలు సమర్పించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు హాస్టళ్లలో అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓలకు అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. జిల్లాలోని వీఐపీల జాబితా సిద్ధం చేయడంతో పాటు హౌసింగ్‌ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement