నారాయణపేట రూరల్: ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత స్వార్థం లేకుండా దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 12 ఏళ్లుగా భారత ప్రధానిగా పనిచేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ప్రజల విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం అనే సూత్రంతో నేడు ప్రపంచ నేతగా ఎదిగారని కొనియాడారు. శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల్లో అనేక స్కాములు జరిగాయని, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలతో సహా మీడియా కూడా తప్పుబట్టని స్వచ్ఛమైన పాలన మోదీ అందిస్తున్నారని తెలిపారు. దేశరక్షణకు ప్రాధాన్యమిస్తూ స్వదేశీ పరిజ్ఞానంతో మిస్సైల్స్ వరకు ఉత్పత్తి చేసి సత్తా చాటారన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ తీసుకొచ్చిన సడక్ యోజన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ రోజుకు దేశవ్యాప్తంగా 35 కిలోమీటర్ల హైవే నిర్మాణ పనులు సాగుతున్నాయని వివరించారు. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపారన్నారు. ఉచిత పథకాలు అమలు చేయకుండా రాయితీలిస్తూ ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నారని చెప్పారు. కేవలం అధికారం కోసం ఉచిత హామీలిస్తూ ఖజానా ఖాళీ చేశారని ఇండియా కూటమి పార్టీలను విమర్శించారు. కోవిడ్ సమయంలో స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రజలను కాపాడుతూ ప్రపంచ దేశాలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. అనంతరం మోదీ చేసిన పనులకు సంబంధించి ముద్రించిన పుస్తకాలు విడుదల చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, కొండయ్య, శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, ప్రధానకార్యదర్శి లక్ష్మి, రఘురామయ్యగౌడ్, కెంచె శ్రీనివాస్ మంజుల, కిరణ్, పార్టీ జిల్లా, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


