కొత్త సభ్యుల ఎంపిక..
గతేడాది ఇలా..
మహిళా సంఘాలకు రూ.304.37 కోట్లు
● 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రుణ లక్ష్యం ఖరారు
● రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు
● డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు
అధికారుల కసరత్తు
●
మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఏటా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ ఏడాది కూడా రుణ లక్ష్యం విధించి వందశాతం చేరుకునేలా దిశా నిర్దేశం చేశాం. గతేడాది జిల్లాలో వందశాతం రుణ లక్ష్యం చేరుకున్నాం. రుణ లక్ష్యంలో వెనకబడ్డ మండలాలను ముందుకు తీసుకెళ్లేలా అధికారులను సమయాత్తం చేస్తాం.
– ఎన్.వెంకట్రాములు, డీఆర్డీఓ
నర్వ: గ్రామీణ మహిళల సంఘటితానికి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రుణ లక్ష్యం ఖరారు చేసింది. జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.263.17 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితో పాటు అదనంగా సీ్త్రనిధి రుణాలు రూ.41.20 కోట్లు కలిపి మొత్తం రూ.304.37 కోట్ల రుణాలు మంజూరుచేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను సర్కారు ఏటా అందజేస్తోంది. నిర్దేశించిన రుణ లక్ష్యాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికే అధిగమించడానికి ఐకేపీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
జిల్లాలో 8,094 సంఘాలు..
జిల్లాలో ప్రస్తుతం 8,094 పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. ఆయా గ్రూపు సభ్యులు చేపట్టే వ్యాపారం మేరకు రూ.లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. చాలామంది మహిళలు కుటీర పరిశ్రమలు, కిరాణం, పిండిగిర్ని, టైలరింగ్, వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు తీసుకుంటారు. గతంలో తీసుకున్న రుణాల రికవరీ శాతం సక్రమంగా ఉన్న కారణంగా ఈ ఏడాది కూడా బ్యాంకర్లు త్వరగానే రుణాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. గ్రూపు రుణాలే కాకుండా మహిళలు వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. వారు ఏ వ్యాపారం కోసం రుణం తీసుకుంటున్నా రో వివరించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తీసుకునే రుణాలకు బృందం సభ్యులు పూచికత్తుగా ఉంటారు.
ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తే మేలు..
మహిళా సంఘాలకు మంజూరు చేసిన రుణాల వడ్డీని ప్రభుత్వం ప్రతి నెలా విధిగా చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ వడ్డీ డబ్బులు సక్రమంగా రాకపోవడంతో మహిళలే చెల్లిస్తున్నారు. మహిళలు చెల్లించిన వడ్డీని సర్కారు వారి ఖాతాల్లో జమ చేస్తోంది. గతేడాది వడ్డీ బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వడ్డీ డబ్బులు ప్రతి నెలా చెల్లించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.
స్వయం సహాయక సంఘాల్లో 18 ఏళ్లు నిండి వివాహం అయిన వారిని మాత్రమే చేర్చుకుంటారు. అవివాహితులు, ప్రభుత్వ ఉద్యో గులు, ఉద్యోగుల భార్యలకు ఇందులో చోటు ఉండదు. దారిద్రరేఖకు దిగువన ఉన్న మహిళలకే ప్రథమ ప్రాధా న్యం ఉంటుంది.
జిల్లాలో 2025–26 (గతేడాది) ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు ఇచ్చిన వార్షిక రుణ లక్ష్యాన్ని (బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి) దాదాపు అన్ని మండలాలు పూర్తిచేయగా... కోస్గి (54.15 శాతం), కృష్ణా (54.62), దామరగిద్ద (63.89), నారాయణపేట మున్సిపాలిటీలు (64.27 శాతం) బాగా వెనకబడ్డాయని అధికారులు పేర్కొన్నారు.


