● రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు
● అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి
సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు
కొల్లాపూర్: కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్‌లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. పను లు పూర్తయ్యాయని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు.
రూ.1.50 కోట్లతో నిర్మాణం..
కొల్లాపూర్ నుంచి సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఐదేళ్ల క్రితం పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ.1.50 కోట్లను హరిత, టీకేహెచ్‌ఎస్ ద్వారా కేటాయించి పనులు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. రెండేళ్ల కిందటే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అప్పట్లో భారీ వర్షాల కారణంగా పార్కు నుంచి వ్యూ పాయింట్‌కు వెళ్లే రోడ్డు కోతకు గురికావడంతో ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. తర్వాతి కాలంలో రోడ్డుకు మరమ్మతు చేసినా.. పార్కు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు.
షార్ట్‌ఫిల్మ్‌లకు వేదికగా..
పార్కు నుంచి అటవీ ప్రాంతం లోపల ఎత్తైన ప్రాంతంలో వ్యూపాయింట్ నిర్మించారు. పార్కు నుంచి వ్యూపాయింట్‌కు వెళ్లేందుకు వీలుగా కిలోమీటర్ మేర మట్టి రోడ్డు ఏర్పాటుచేశారు. రోడ్డుకు ఇరువైపులా ట్రెంచ్, కంచె నిర్మించారు. వ్యూ పాయింట్ వద్దకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రెండు ప్రత్యే క వాహనాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు. పార్కు నిర్వహణను ప ర్యవేక్షించేందుకు సిబ్బందిని సైతం ఏర్పాటు చేశా రు. అధికారికంగా పార్కు ప్రారంభం కానప్పటికీ.. అనధికారికంగా పర్యాటకులు వ్యూ పాయింట్ వర కు వెళ్లేందుకు ఇటీవల కాలంలో అనుమతులు ఇస్తున్నారు. పార్కు ప్రారంభమైతే షార్ట్‌ఫిల్మ్ షూటింగ్‌లకు వ్యూపాయింట్ వేదికగా మారే అవకాశం ఉంటుంది.
కొల్లాపూర్ – సోమశిల దారిలో
నిర్మించిన అటవీ పార్కు
త్వరలో ప్రారంభిస్తాం..
ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్‌ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది.
– వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్


