● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
నారాయణపేట: జిల్లాలో కులం అనే విద్వేషాన్ని రూపుమాపి ఎస్సీ, ఎస్టీ కేసులు లేకుండా చూడాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ తెగల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధ్యక్షతన జరిగిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆయన మఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. కులం విషయంలో అవమానపడ్డ వ్యక్తిగా తాను కుల విధ్వేషాలను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో మాట్లాడి ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని మంజూరు చేయిస్తామన్నారు. విద్యావ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని అన్ని తండాలకు బీటీరోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి తండాకు 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని వెల్లడించారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ రమేష్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు క్రాంతికుమార్, జనార్దన్, అశోక్, శంకర్, కిష్ణానాయక్ పాల్గొన్నారు.
ఆగస్టు వరకు సిద్ధం చేయాలి..
జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం పనులు త్వరగా పూర్తిచేసి ఆగస్టు వరకు సిద్ధం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి, కలెక్టర్ ఛాంబర్‌ను చూసి పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని కోరారు. పంద్రాగస్టు వరకు వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.


