నారాయణపేట: జిల్లా ప్రజలు సమీకృత మార్కెట్‌యార్డును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. శుక్రవారం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ (సమీకృత మార్కెట్) యార్డును ఆమె ప్రారంభించి మాట్లాడారు. సమీకృత మార్కెట్‌యార్డులో వివిధ రకాల సేంద్రియ కూరగాయలతో పాటు పండ్లు, ఆహార ధాన్యాలు, మహిళా సంఘాలు ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. సేంద్రియ కూరగాయలు, ధాన్యాల కోసమే నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డును వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి శుక్రవారం మార్కెట్ సముదాయంలో ఆయా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వెంకట్రాములు, ఏడీఏ సక్రియానాయక్, జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, పుర కమిషనర్ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ మంజుల, సత్యయాదయ్, సత్యమ్మ, భరత్, అరుంధతి, బండి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


