అందని ఆర్థికాభివృద్ధి పథకాలు
గిరిజనులకు సంబంధించి విద్య, వైద్యం, ఇతర మౌళిక సదుపాయాల కల్పన, నీటి పారుదల, వ్యవసాయం, రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ, ట్రైకార్ రుణాలు, మత్స్యశాఖ పరిధిలో చేపపిల్లల పెంపకం వంటి పథకాలు సరిగా అమలు కావడం లేదు. ఇందుకు ఏటా నిధులు కేటాయిచడం లేదని చెంచులు వాపోతున్నారు. చెంచు మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు గిరిపోషణ పథకం కింద రూ.కోటి నిధులు మంజూరైనా రూ.20 లక్షలకు మించి ఖర్చు కావడం లేదని తెలుస్తోంది. గిరివికాసం కింద గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు ఉచితంగా బోర్లు వేసి మోటార్లు ఇవ్వాల్సి ఉండగా చాలామందికి ఈ పథకం అందడం లేదు. పశుసంవర్ధక శాఖ ద్వారా గొర్రెలు, మేకలు, పశువులు సబ్సిడీపై అందించేది. కానీ, ఆ శాఖ అధికారులు లేకపోవడంతో పూర్తిగా మరుగున పడింది. ప్రభుత్వం ఇప్పటికై నా రెగ్యులర్ పీఓతోపాటు మిగతా పోస్టులు భర్తీ చేస్తేనే చెంచులకు ప్రాజెక్టు సేవలు అందుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అచ్చంపేట: ప్రభుత్వాల పట్టింపులేని ధోరణి.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. వెరసీ మన్ననూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏలను చక్కదిద్ది పూర్వవైభవం తెస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలుగానే మారిపోతున్నాయి. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం (సున్నిపెంట) ఐటీడీఏలో భాగంగా ఉండి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన్ననూర్‌లో ఏర్పాటైంది. అయితే ఐటీడీఏగా అవతరించి పన్నెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు రెగ్యులర్ ప్రాజెక్టు అధికారి, ప్రధాన పోస్టులు మంజూరు చేయలేదు. నల్లమలలోని చెంచులు, ఆదివాసీల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలకు పీఓనే కీలకం. అలాంటిది ఏళ్ల తరబడి ప్రాజెక్టు అధికారి, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్కే ఒక్కడు..
చెంచులకు అన్ని సంక్షేమ పథకాలు, అధికారులను అందుబాటులోకి తెచ్చి వారికి సేవలను విస్తృతపర్చడమే ఐటీడీఏ లక్ష్యం. సున్నిపెంట నుంచి ప్రాజెక్టు విభజన సమయంలో 57:43 నిష్పత్తిలో ఉద్యోగులను నియమిస్తే అన్ని విభాగాల్లో కలిపి 20 పోస్టులు ఉండాలి. విలీనమైన తర్వాత రికార్డులతోపాటు సీనియర్ అసిస్టెంట్ జాఫర్‌ను నియమించారు. అతను ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగం, డీఎస్‌ఓ, మేనేజర్, సీఎస్‌ఓ, హెచ్‌ఓలు, మత్య్సశాఖ, హార్టికల్చర్, పశువైద్యం, ఇద్దరు పర్యవేక్షకులు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయాధికారి, ఏఈఓ, కార్యాలయ సిబ్బంది పోస్టులకు గాను ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.
ఐటీడీఏలో అంతర్భాగంగా..
గతంలో ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం కలెక్టరేట్‌ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళాడేది. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 56 ప్రాథమిక పాఠశాలలు, 16 ఆశ్రమ పాఠశాలు, చెంచులకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతోపాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా భూమిపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతీ లేదు. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న చెంచులకు భూ పంపిణీ జరగడం లేదు.
జిల్లాలు :
నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి
గిరిజన జనాభా 14,436
గ్రామాలు 173
చెంచు కుటుంబాలు 4,041
మొత్తం పోస్టులు (అన్ని విభాగాల్లో కలిపి) 20
ప్రస్తుత ఖాళీలు (అన్ని విభాగాల్లో కలిపి) 19
మన్ననూర్
ఐటీడీఏ
స్వరూపం..
రెగ్యులర్ పోస్టులకు నోచుకోని మన్ననూర్ ప్రాజెక్టు
పన్నెండేళ్లు గడిచినా సిబ్బంది నియామకంలో కాలయాపన
ఇన్‌చార్జి పీఓలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం
చెంచుల ఆర్థికాభివృద్ధి పథకాల అమలులో ఆటంకం
నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు.. అధికారుల ప్రతిపాదనలు
పీఎం జన్‌మన్‌కే పరిమితం
అత్యంత దర్భర జీవితం గడుపుతున్న చెంచులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం జన్ మన్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, జన్‌ధన్ బ్యాంకు ఖాతా వంటి మౌళిక సదుపాయాలు ప్రతి చెంచుకు అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అందిస్తున్నారు. ఇవీ మినహా గిరిజనుల కోసం చేపట్టే మిగతా ఏ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు.
పోస్టులు భర్తీ చేయలేదు..
మన్ననూర్ ఐటీడీఏను 2015 నుంచి ఒకే ఒక్కరితో నెట్టుకొస్తున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీని వల్ల చెంచులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అధికారులు లేకపోవడంతో సకాలంలో పనులు కావడం లేదు. బడ్జెట్ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
– శ్రీనివాసులు,
ఆదివాసీ చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు
మండలాలు
25


