ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ
ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకం..
ప్రతి ప్రీ ప్రైమరీ విభాగానికి బోధకులను నియమించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇన్‌స్ట్రక్టర్లు కనీసం ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. అదేవిధంగా ఆయా కనీస విద్యార్హత ఏడోతరగతి. ఇరువురు 18 నుంచి 44 ఏళ్లులోపు స్థానికులై ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఇచ్చారు. ఈ నియామకాలు తాత్కాలికమని ప్రభుత్వం వెల్లడించింది. వీరికి ఏడాదికిగాను 10 నెలలు గౌరవ వేతనం అందిస్తారు. అదేవిధంగా పాఠశాల నిర్వహణకు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు.
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు డబ్బులు వెచ్చించకుండా ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేసింది. ప్రత్యేక నిధులు కేటాయించి తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు అదనంగా బోధకులు, ఆయాలను కేటాయించింది. విడతల వారీగా అన్ని గ్రామాలకు విస్తరించి వంద శాతం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. – విద్యాసాగర్, జిల్లా అకాడమిక్
మానిటరింగ్ అధికారి, నారాయణపేట
నారాయణపేట రూరల్: ఐదేళ్లలోపు చిన్నారులకు సైతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆటపాటలతో చదువుపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించింది. చిన్నారుల మనోవికాస అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి పాఠశాల విద్యాశాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. గతేడాది కార్యాచరణలో భాగంగా పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది.
సత్ఫలితాలతో ముందుకు..
గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలు సత్ఫలితాలు ఇవ్వడంతో 2026–2027 విద్యా సంవత్సరం మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా కొత్తగా మంజూరు చేసిన పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష మంజూరు చేసి సామగ్రి కొనుగోలు, పెయింటింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 94 పాఠశాలల్లో ప్రారంభించగా.. తాజాగా వాటి సంఖ్య మూడింతలు చేసి 292 పాఠశాలలకు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటి వరకు 386 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందనుంది.
ఉమ్మడి జిల్లాలో రెండోవిడతలో 292 పాఠశాలలు ఎంపిక
తరగతి గది, సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు
ఐదేళ్లలోపు చిన్నారులకు అవకాశం
ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు
పర్యవేక్షణ బాధ్యత ప్రధానోపాధ్యాయులదే..


