నారాయణపేట: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించి ప్రజల నుంచి రూ.కోట్లు దోచుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయని.. సోషల్ మీడియాలో వచ్చే ‘అధిక లాభాలు’ ఆఫర్లు పూర్తిగా మోసపూరితమని పేర్కొన్నారు. చైన్ స్కీమ్‌లు నమ్మొద్దని, డబ్బులు వస్తాయని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పే సందేశాలు పూర్తిగా మోసమని స్పష్టం చేశారు. అనుమతి లేని లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయడంతో కాంటాక్ట్స్, ఫొటోలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించి తర్వాత వేధింపులకు పాల్పడుతున్నారని.. రుణం చెల్లించిన తర్వాత కూడా అదనపు డబ్బులు డిమాండ్ చేసి బెదిరింపులకు దిగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లోన్ యాప్ వేధింపులకు గురైన వారు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని.. కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ మోసాల బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930, డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు.
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు/అచ్చంపేట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 4,750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,422 క్యూసెక్కులు వదలగా.. మరో 41 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.024 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
● శ్రీశైలం జలాశయంలో ఆదివారం 818.70 అడుగుల వద్ద 39.9087 టీఎంసీల నీరు నిల్వ ఉందని గేజింగ్ అధికారి శ్యామెల్ విజయ్ తెలిపారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన తుంగభద్ర, జూరాల ప్రాజెక్టు నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదన కూడా చేయడం లేదని చెప్పారు.
అగ్నివీర్‌ల సేవలు దేశానికి అవసరం
దామరగిద్ద: అగ్నివీర్‌ల సేవలు దేశానికి ఎంతో అవసరమని భారత అథ్లెటిక్స్ కోచ్, అర్జున అవార్డు గ్రహీత నాగపూర్ రమేష్ అన్నారు. ఆదివారం మండలంలోని బాపన్‌పల్లి సమీపంలో మిల్కాసింగ్ అకాడమీలో శిక్షణ పొంది అగ్రివీర్‌లుగా ఎంపికై న వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వారిని శాలువాలతో సన్మానించి మాట్లాడారు. 40 మంది అగ్నివీర్‌లుగా ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. బాపన్‌పల్లి సర్పంచ్ శ్రీనివాస్, దామరగిద్ద సర్పంచ్ కన్కిరెడ్డి, మాజీ సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి, మొగులప్ప, రమణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
‘పాలమూరు’పై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం వారు జిల్లాకేంద్రంలోని పీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిన వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి పాలమూరు అభివృద్ధికి పెద్దపీట ఇవేమీ చర్చించకుండా మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2016లో పాలమూరును ప్రారంభిస్తే 2022 వరకు కేంద్రానికి డీపీఆర్ ఎందుకు సమర్పించలేదన్నారు. వరద ఆధారంగా కాకుండా మిగులు జలాలతో చేపడుతున్నామని అప్పట్లో నివేదించింది వాస్తవమా.. కాదా.. అని ప్రశ్నించారు. ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు.. తాగునీటి ప్రాజెక్టు అని.. కేవలం 7.15 టీఎంసీలు మాత్ర మే వాడుకుంటామని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం ఎవరూ మరిచిపోలేదన్నారు. వీటన్నింటికీ బీఆర్‌ఎస్ నేతలు సరైన సమాధానం చెప్పిన తర్వాతే ప్రజల్లోకి రావాలన్నారు.


