ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలి

Jun 8 2026 10:17 AM | Updated on Jun 8 2026 10:17 AM

మక్తల్‌: వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరుపై మరొకరు విమర్శలు చేయడం మానుకొని ఉమ్మడి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసి ఈ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించాలని ఉమ్మడి జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ వైస్‌ చైర్మన్‌ ఎం.రాఘవాచారి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని భీమానదిపై తండిగి, సంగంబండ, భూత్పూర్‌ రిజర్వాయర్లను జేఏసీ బృందం సందర్శించింది. అనంతరం కాట్రేవ్‌పల్లి దగ్గర మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మక్తల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూర్‌–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భీమా నుంచి నీరు తరలిస్తే ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందుతుందన్నారు. ప్రజలకు అవసరమయ్యే చోట బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించాలని సూచించారు. మక్తల్‌ నియోజకవర్గంలో అసంపూర్తి దశలో ఉన్న పెండింగ్‌ బ్రిడ్జి కం బ్యారేజీలు, పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం, ఎమ్మెల్యేలకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికంగా పూర్తి చేయకపోతే ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారని.. డిండి పేరుతో పాలమూరు–రంగారెడ్డి నీటిని దొంగచాటున నల్గొండకు తరలించుకుపోవడాన్ని ఏమాత్రం సహించమన్నారు. నియోజకవర్గ ప్రజల ప్రయోజనార్థం కృష్ణా, భీమా నదులపై అనువైన చోట్ల బ్యారేజీలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కృష్ణా, భీమా నదుల సంగమం కింద పెద్ద ఆనకట్ట నిర్మించి అవసరమైన నీటిని ఎత్తిపోసి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు నీరందించాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టులను పూర్తిచేసే వరకు ప్రజలతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జేఏసీ వైస్‌ చైర్మన్‌ బెక్కం జనార్దన్‌, చెన్నకిష్టన్న, రామేశ్వర్‌, మక్తల్‌ జేఏసీ చైర్మన్‌ సూర్యప్రకాష్‌, కేఎన్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, హనీఫ్‌, తిమ్మప్ప, దత్తాత్రేయ, లక్ష్మీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement