భూమికి హద్దులతో భూ ఆధార్
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: భూములకు ఆధునిక సాంకేతికతో కచ్చితమైన హద్దులు, నిర్దిష్టమైన కొలతలు నిర్ణయించి రైతులకు భూ ఆధార్ ఇచ్చేందుకు ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో గుర్తించిన మూడు గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించి ఏడీ సర్వే ల్యాండ్, తహసీల్దార్లు, సర్వేయర్లతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రీసర్వేకు నారాయణపేట మండలం శేర్నపల్లి, నర్వ మండలం జంగంరెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాలను ఎంపిక చేసిందని చెప్పారు. శేర్నపల్లిలో 1,567 ఎకరాలు, జంగంరెడ్డిపల్లిలో 1,500 ఎకరాలు, కొత్తపల్లిలో 1,167 ఎకరాలు రీ సర్వే చేసి ఆయా గ్రామాలకు సరిహద్దులు, శివార్లు, ప్రభుత్వ భూములు, రోడ్లు, భవనాలు, అటవీ, దేవాదాయ, శిఖం భూములను గుర్తించి పూర్తిస్థాయి మ్యాపులను రూపొందించాల్సి ఉంటుందన్నారు. రీసర్వేకు ముందురోజు ఆయా గ్రామాల్లో టాంటాం వేయించాలని, గ్రామసభ నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీ కార్యాలయాల్లో పట్టాదారుల వివరాలు ప్రదర్శించాలన్నారు. శుక్రవారం నుంచి ఆయా గ్రామాల్లో రీసర్వే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, సర్వే ల్యాండ్ ఏడీ వేణుగోపాల్, కోస్గి, నారాయణపేట తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, అమరేంద్ర కృష్ణ, సర్వేయర్లు పాల్గొన్నారు.
ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలి..
జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఏఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 3,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించామని.. ప్రతి ఏఈఓ 25 ఎకరాలు సాగు చేయించాలని, సర్పంచులకు సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ఏడాది లక్ష్యం చేరుకోకపోవడంతో వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా లోని నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా, మరికల్, ధన్వాడ, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి, మద్దూర్ సాగుకు అ నుకూలమని.. రైతులు సాగుచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఉద్యాన అధికారి సాయిబాబా, ఆయిల్‌ఫెడ్ అధికారులు, కో–ఆపరేటివ్ అధికారులు ఆంజనేయులు పాల్గొన్నారు.


