నైపుణ్యాల మెరుగుతోనే ఉపాధి అవకాశాలు
కోస్గి రూరల్: ప్రస్తుత సమాజంలో పోటీ తీవ్రంగా ఉన్నందున విద్యార్థులు ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. గురువారం పట్టణంలోని ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి టెక్‌ఫెస్ట్–2026 నిర్వహించగా.. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, వనపర్తి, పెబ్బేరు, వడ్డేపల్లి కళాశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక ఆలోచనలు, సృజనాత్మకత పోటీతత్వాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన కోస్గి పాలిటెక్నిక్ కళాశాల ప్రథమ స్థానం, మహబూబ్‌నగర్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలవగా.. ధ్రువపత్రాలు అందజేశారు. వీరు రాష్ట్రస్థాయి టెక్‌ఫెస్ట్‌లో పాల్గొననున్నారని చెప్పారు. ప్రదర్శనను ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు తిలకించారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన బృందం కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ కోర్సు ప్రారంభానికి అవసరమైన తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో వసుంధరరాణి, ప్రవీణ్‌కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


