వికసిత భారత్ కేంద్ర లక్ష్యం
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
నారాయణపేట/కోస్గి రూరల్/కొత్తపల్లి: గ్రామీణ పేదల అభ్యున్నతితో పాటు ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం కోస్గి, మద్దూర్ పురపాలికల్లో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తన సొంత నియోజకవర్గంలో కూడా నెరవేర్చలేదన్నారు. రుణాలు ఎక్కడా లభించడం లేదని స్వయంగా ఆయనే చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ బియ్యం వంటి వాటికి నిధులు మంజూరు చేస్తోందని వివరించారు. అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడలేదని, పేదల ఆర్థికాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 2047 నాటికి వికసిత భారత్ రూపకల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో సుమారు రూ.55 వేల కోట్లతో హైస్పీడ్ రైల్ కారిడార్‌ను మంజూరు చేసిందని.. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే, చైన్నెకి నడువనున్నాయన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లిం సోదరులకు చేసిందేమీ లేదని.. ఓట్ల కోసం మత రాజకీయాలు చేపడుతుందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రధాని అభివృద్ధిలో ముందుకుసాగుతున్నారని వి వరించారు. కోస్గి, మద్దూర్ పురపాలికల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని.. పురపాలికలపై బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు రాజవర్ధన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


