రోడ్డు ప్రమాదాల నివారణలో ఉద్యోగుల పాత్ర కీలకం
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఎస్పీ డా.వినీత్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఆశావర్కర్లు, మెప్మా, సెర్ఫ్ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా 10 రోజులుగా రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో కలిసి బ్లాక్ స్పాట్స్‌ను సందర్శించినప్పుడు వారి బాధలు వర్ణనాతీతమని.. ఒక కుటుంబంలో పెద్దను కోల్పోతే ఆ కుటుంబమంతా ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో చేతులు, కాళ్లు విరగడం లేదా శాశ్వత వికలత్వం కలిగితే జీవితాంతం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించాలని సూచించారు. ప్రజలకు నేరుగా సేవలు అందించే ప్రతి ఉద్యోగి రోడ్డు భద్రత నియమాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండి.. మరో 10 మందికి అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా ఒక ప్రాణాన్ని కాపాడినవారమవుతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


