జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం
నారాయణపేట: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేస్తూ.. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరం పునరంకితమవుదామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. సాధించిన ప్రగతిని కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోందన్నారు. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా.. సంక్షేమంలో సరికొత్త అధ్యయనం సృష్టించేలా ముందుకు సాగుతోందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన.. నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిందని వివరించారు.
రూ.574 కోట్లతో రైతు రుణమాఫీ..
జిల్లాలో 65,631 మంది రైతుల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం రూ.574 కోట్లు విడుదల చేసిందన్నారు. రైతుభరోసా వానాకాలం–2025కు గాను 1,79,154 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.261 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. రైతుబీమా 2025–26కు గాను 1.18 లక్షల మంది అర్హులు కాగా.. వివిధ కారణాలతో 261 మంది మృతిచెందారని.. వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున అందించి అండగా నిలిచినట్లు కలెక్టర్ వివరించారు. అదే విధంగా జిల్లాలో 117 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి.. 19,234 మంది రైతుల నుంచి రూ. 335 కోట్ల విలువైన 1,40,266 టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ. 500 చొప్పున రూ. 43కోట్ల బోనస్ రైతులకు అందించామన్నారు. ధన్వాడ మండలంలోని కిష్టాపూర్‌లో 50 మంది రైతులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులతో రూ. 59.88లక్షలతో విద్యుత్ సదుపాయం, వ్యవసాయ బోర్లు, మొదటి పంట సహాయం అందించినట్లు తెలిపారు.
● రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్, డీజిల్ బంక్‌ను నారాయణపేటలో రూ. 1.30 కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించామన్నారు. పెట్రోల్‌బంక్‌ను మహిళలచే విజయవంతంగా నడుపుతూ ఇప్పటి వరకు రూ.12.93 లక్షల లాభం పొందినట్లు వివరించారు.
● ఉపాధి హామీ పథకం ద్వారా 1,06,904 జాబ్ కార్డుదారులకు 4,183 లక్షల పనులు సమకూర్చడం జరిగిందన్నారు. చేయూత పింఛన్ లబ్ధిదారులు 73,611 మందికి ప్రతినెలా రూ. 19కోట్లు పంపిణీ చేయడంతో పాటు బ్యాంక్ లింకేజీ ద్వారా 6,861 సంఘాలకు రూ. 179 కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో 3,445 మంది కూలీల కుటుంబాలకు రూ. 6వేల చొప్పున బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేశారన్నారు.
విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ..
జిల్లాలో చేపట్టిన చదువుల పండగలో భాగంగా ఎంపిక చేసిన 38 పాఠశాలల్లో ఫైనాన్షియల్ లిటరసీ, 19 పాఠశాలల్లో కేరీర్ గైడెన్స్, మరో 12 పాఠశాలల్లో ఆష్రానమి క్లబ్స్ ఏర్పాటు, 12 పాఠశాలల్లో వేద గణితం కార్యక్రమం, 20 పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తూ 12,800 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడం జరిగిందన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో 478 యంగ్ ఆరేటర్ క్లబ్‌ల ఏర్పాటు, పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన, విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేసేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా క్యూఆర్ కోడ్ విధానంతో మానిటరింగ్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని కోస్గిలో ప్రారంభించారని.. ఈ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధస్సు యంత్ర అభ్యాసం, డేటా సైన్స్ కోర్స్‌ల్లో ప్రవేశం కలదన్నారు. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు.
నేతన్నకు చేయూత..
నేతన్న పొదుపు కింద 904 మంది చేనేత కార్మికులకు బ్యాంకు ఖాతాలను తెరిపించి.. రూ. 29.95 లక్షలు అందించినట్లు కలెక్టర్ వివరించారు. నేతన్న బీమా కింద 17 మంది కార్మికులకు రూ. 85లక్షలను వారి నామినీ ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ శాఖల స్టాళ్లను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ డా.వినీత్, అదనపు కలెక్టర్ శ్రీను, ఏఎస్పీ రియాజ్ హాల్ హాక్, డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ రామచందర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. జిల్లాలో ఇప్పటి వరకు 2,24,90,000 మంది మహిళలకు రూ.106.72 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రూ.500కే వంటగ్యాస్ పథకం కింద జిల్లాలో 70,056 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 9.33కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. గృహజ్యోతి పథకంతో 81,788 మంది లబ్ధిదారులకు 2024 జూన్ నుంచి ఈ నెల వరకు జిల్లాలో రూ. 38కోట్ల సబ్సిడీ అందిందన్నారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు జిల్లాలో 6,362 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. 1,276 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. లబ్ధిదారులకు రూ. 58.78 కోట్లు అందించామన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో 2,529 మందికి రూ. 25కోట్లు, , షాదీ ముబారక్‌తో 260 మందికి రూ. 2కోట్లు అందించడం జరిగిందన్నారు.
భూ పరిహారం ఎకరాకు రూ.20లక్షలు
మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.2945.50 కోట్ల అంచనా వ్యయంతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చిందన్నారు. ఇందుకు 2,705 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 20లక్షల చొప్పున నష్టపరిహారం 3,591 మంది రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 433 ఎకరాల భూ నిర్వాసితులు 634 మందికి రూ. 90కోట్లు అందించడం జరిగిందన్నారు. ఇంకా దశల వారీగా భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం పంపిణీ చేస్తామన్నారు.
ప్రజా సంక్షేమంలో సరికొత్త అధ్యయనం
యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన.. నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మహిళా సమాఖ్య పెట్రోల్‌బంక్‌తో రూ.12.93 లక్షల లాభం
కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం


