నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● ఎన్నికల నిర్వహణలో
పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిలతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణతో మొదలుకొని పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన, గుర్తుల కేటాయింపు, స్ట్రాంగ్‌రూంల ఏర్పాటు, పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో చిన్న పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ సూచించారు. వీసీలో డా.వినీత్, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్డీఓ రామచందర్ నాయక్, నోడల్ అధికారులు సాయిబాబా, జాన్ సుధాకర్, అబ్దుల్ ఖలీల్, రహమాన్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.


