నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
నారాయణపేట ఎడ్యుకేషన్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 8 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు పుర కమిషనర్ నర్సయ్య తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయా వార్డులకు నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
యూరియా పక్కదారి పడితే చర్యలు
కోస్గి రూరల్/మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫర్టిలైజర్ యూరియా యాప్ ద్వారానే వ్యవసాయదారులకు యూరియా విక్రయాలు చేపట్టాలని డీఏఓ జాన్ సుధాకర్ అన్నారు. మంగళవారం కోస్గి, మద్దూరు, గుండుమాల్‌లోని ఎరువుల విక్రయ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ యూరియా యాప్‌తో రైతులకు విక్రయాలు చేపట్టడం వల్ల యూరియా లభ్యత స్పష్టంగా తెలుస్తుందన్నారు. యూరియాను పక్కదారి పట్టిస్తే సంబంధిత ఫర్టిలైజర్ దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కోస్గి వ్యవసాయ కార్యాలయంలో కొనసాగుతున్న ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. డీఏఓ వెంట ఏడీఏ రామకృష్ణ, ఏఓ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
‘పది’లో వందశాతంఉత్తీర్ణత సాధించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. మంగళవారం నారాయణపేట మండలంలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అభ్యాస దీపికలో ఉన్న ముఖ్యాంశాలను చదివితే సులభంగా వార్షిక పరీక్షలు రాయవచ్చన్నారు. వీక్లీ, రీవిజన్ టెస్టులను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా రాయాలని సూచించారు. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను ఉపాధ్యాయులు క్రమ పద్ధతిలో దిద్దాలని.. చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డీఈఓ వెంట హెచ్‌ఎం భారతి, భానుప్రకాశ్, నర్సింహ, నిర్మల, రఘురాంరెడ్డి తదితరులు ఉన్నారు.
పీఎఫ్‌తో కార్మికులకు ప్రయోజనం
అమరచింత: కంపెనీల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్‌తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని హైదరాబాద్ పీఎఫ్ కార్యాలయ అధికారి రుధీర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘాన్ని సందర్శించిన ఆయన కార్మికులతో సమావేశమై ప్రధానమంత్రి వికసిత్ రోజ్‌గార్ యోజన, ఎంప్లాయి ఎన్‌రోల్‌మెంట్ కాంపెయిన్ గురించి అవగాహన కల్పించారు. కంపెనీ యాజమాన్యాలతో పాటు ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. యాజమాన్యం ప్రతి కార్మికుడు, ఉద్యోగికి పీఎఫ్, ఇన్సూరెన్స్, పింఛన్ అందేలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో కంపెనీ సీఈఓ ఎం.చంద్రశేఖర్, కంపెనీ డైరెక్టర్ పొబ్బతి అశోక్, సిబ్బంది మహేష్‌తో తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం


