ఎత్తిపోతలకు గ్రహణం
కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడటం లేదు. ప్రాజెక్టు ద్వారా నీటి పంపింగ్‌కు తరచుగా బ్రేకులు పడుతున్నాయి. ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెబుతున్న అధికారులు.. నీటి ఎత్తిపోతలు మాత్రం ఇప్పట్లో జరగవని తేల్చి చెబుతున్నారు. రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో నీటి ఎత్తిపోతలపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం అరకొరగా బడ్జెట్ కేటాయిస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదనే ప్రచారం కూడా ఉంది.
మూడేళ్ల క్రితం మొదటి పంపుతో..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎల్లూరు సమీపంలోని పంప్‌హౌజ్‌లో ఒక మోటారు ఆన్‌చేసి.. నీటి ఎత్తిపోతలు చేపట్టారు. రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. మరుసటి ఏడాది తాగునీటి అవసరాల కోసం నాలుగు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసుకునేందుకు అనుమతులు లభించాయి. కానీ పంప్‌హౌజ్‌లో మోటార్ల బిగింపు, సివిల్ వర్క్స్, విద్యుత్ సరఫరా పనులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణాలతో నేటి వరకు రెండో దఫా ఎత్తిపోతలు జరగడం లేదు.
నాలుగు మోటార్ల బిగింపు..
ప్రాజెక్టులోని మొదటి లిఫ్ట్ అయిన ఎల్లూరు పంపుహౌజ్‌లో ఇప్పటివరకు నాలుగు మోటార్లు బిగించారు. మూడు మోటార్ల పనులన్నీ పూర్తయ్యాయి. మరో మోటారు ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. లిఫ్టులో మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. సివిల్ వర్క్స్ దాదాపుగా పూర్తిచేశారు. మెకానికల్, సిస్టమ్ వర్క్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. డెలివరీ మెయిన్స్ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు వద్ద నిర్మించిన 400/11 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్ పనులు ఆలస్యం అవుతుండటమే నీటి ఎత్తిపోతలు జరగకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
కేఎల్‌ఐ ద్వారా రిజర్వాయర్‌లోకి నీరు..
పాలమూరు ప్రాజెక్టులో నార్లాపూర్ రిజర్వాయర్ మొదటిది కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. తర్వాతి కాలంలో పాలమూరు ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు సాగకపోవడంతో కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోసే నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి మళ్లిస్తున్నారు. కేఎల్‌ఐలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటి మళ్లింపునకు వీలుగా ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేశారు. తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడొద్దనే ఉద్దేశంతోనే నీటి మళ్లింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నార్లాపూర్ రిజర్వాయర్‌లో 4 టీఎంసీల మేరకు నీటి నిల్వ ఉంది.
కొలిక్కిరానినిర్వాసితుల సమస్యలు..
నార్లాపూర్ రిజర్వాయర్‌లో అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీరిలో కొంతమందికి సరైన పరిహారం అందలేదు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తేనే.. తాము ఇళ్లు ఖాళీ చేస్తామని కొందరు నిర్వాసితులు మొండికేశారు. ఈ సమస్యను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వారికి పరిహారం ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసేవరకు నార్లాపూర్ రిజర్వాయర్‌లో 4 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని నింపలేమని.. నీటిని అధికంగా నింపితే నిర్వాసితుల ఇళ్లు ముంపునకు గురవుతాయని అధికారులు చెబుతున్నారు.
సీజన్ ముగిసేలోగా..
నార్లాపూర్ రిజర్వాయర్‌లో 4 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. ఈ రిజర్వాయర్‌లోకి మరిన్ని నీళ్లను ఎత్తిపోస్తే నిర్వాసితుల ఇళ్లు మునిగిపోతాయి. తమకు పరిహారం సమస్య పరిష్కారమైతేనే ఇళ్లు ఖాళీ చేస్తామంటున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఒకవేళ ఎత్తిపోసే నీళ్లను ఏదుల రిజర్వాయర్‌కు తరలించాలంటే కాల్వ పనులు పూర్తికావాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఆయా సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎత్తిపోతలను వాయిదా వేస్తూ వస్తున్నాం. ఈ ఏడాది సీజన్ ముగిసేలోగా కచ్చితంగా ఎత్తిపోతలు చేపడతాం.
– శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ
అసంపూర్తి కాల్వలతో..
నార్లాపూర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఉన్న నీటిని ఏదుల రిజర్వాయర్‌కు పారించేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కుడికిళ్ల, తీర్నంపల్లి శివార్లలో ప్రధాన కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నిధుల లేమి కారణంగా కాల్వ నిర్మాణం మధ్యలోనే నిలిచింది. ఈ క్రమంలో కాల్వ పనులను పూర్తిచేసేందుకు కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100కోట్లకు పైగా నిధులను కేటాయించింది. కానీ పనులు మాత్రం ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఈ కాల్వ పనులు పూర్తయితేనే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించవచ్చు. అప్పటివరకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
పాలమూరు ప్రాజెక్టులో వాయిదా పడుతున్న నీటి పంపింగ్
పెండింగ్ పనులతోనే సమస్య
కేఎల్‌ఐ ద్వారా
నార్లాపూర్ రిజర్వాయర్‌కు నీటి మళ్లింపు
అక్కడి నుంచి ఏదులకు నీటిని తరలించేందుకు అడ్డంకులు
ఎత్తిపోతలకు గ్రహణం


