అనుకున్నదొకటి.. అయ్యిందొకటి! | - | Sakshi
Sakshi News home page

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!

Jan 22 2026 6:56 AM | Updated on Jan 22 2026 6:56 AM

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!

నారాయణపేట: ‘‘గతంలో ఉన్న పార్టీలోనే ఉండి ఉంటే తమను కాదని ఇతరులకు అవకాశాలు వచ్చేవి కావు.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉందని చేరాం.. తమకు సిట్టింగ్‌ స్థానాల్లో అవకాశాలు ఇవ్వాలి.. రిజర్వేషన్‌ అనుకూలించకపోతే ఇతర వార్డుల్లో అవకాశాలు కల్పించాలి’’ అంటూ బీఆర్‌ఎస్‌ నుంచి హస్తం గూటికి చేరిన తాజా మాజీ కౌన్సిలర్లు అధికార పార్టీ నేతలతో పట్టుబడుతున్నారు. అయితే సిట్టింగ్‌ స్థానం రిజర్వేషన్‌ అనుకూలంగా ఉంటే సరేనని.. ఇతర వార్డులో అవకాశం ఇచ్చేందుకు మొదటి నుంచి ఉన్న పార్టీ నాయకులు ఒప్పుకోవడం లేదని అధినేతలు తేల్చిచెబుతున్నారు. దీంతో పార్టీ మారి తప్పుచేశామంటూ పలువురు నాయకులు మదనపడుతున్నారు. తాము అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అంటూ చర్చించుకుంటున్నారు.

ఇదీ పరిస్థితి..

నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్‌ గిరి జనరల్‌ స్థానానికి రిజర్వు అవుతుందని అందరూ భావించారు. తీరా జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో ఆశావహుల ఆశలపై నీళ్లు చలినట్లయ్యింది. మరికొన్ని వార్డుల రిజర్వేషన్లు సైతం ఆశావహులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. కొత్తగా ఏర్పడిన మద్దూర్‌ మున్సిపాలిటీ బీసీ జనరల్‌ రిజర్వు అయ్యింది. ఇక్కడ 2011 జనాభా ప్రాతిపదికన 50 శాతం వార్డులు జనరల్‌ స్థానాలకు రిజర్వు అయ్యాయి. మక్తల్‌లో చైర్మన్‌ కావాలనుకుంటున్న ఓ అభ్యర్థి తన వార్డు రిజర్వేషన్‌ అనుకూలంగా రాకపోవడంతో వేరే వార్డుకు వలస వెళ్లే పరిస్థితి వచ్చింది. కోస్గిలో ఒకటి అనుకుంటే.. మరొకటి అయ్యిందంటూ చర్చ సాగుతోంది. చైర్మన్‌ స్థానంతో పాటు వార్డులు సైతం ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్‌ కావాలో లాజిక్‌గా ఎక్కడ తప్పులకు తావులేకుండా జరిగాయంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మైనార్టీలకు కో‘ఆప్షన్‌’..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ఏ వార్డులో చూసినా ముస్లిం ఓట్లు ప్రభావితం చేస్తాయంటూ రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన బలమైన నాయకులకు కోఆప్షన్‌ పదవులు ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారు. నారాయణపేట 7వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ నుంచి తాజా మాజీ కౌన్సిలర్‌ మహ్మద్‌ సలీం మళ్లీ పోటీచేయాలని ఆశించారు. తీరా ఆ వార్డు ఎస్సీ రిజర్వేషన్‌ కావడంతో పోటీచేసే అవకాశం లేకుండాపోయింది. ఆయన పార్టీ పట్టణ అధ్యక్షుడు కావడంతో మున్సిపాలిటీని హస్తగతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. మరో వార్డులో మజ్లీస్‌ పార్టీ టికెట్‌ ఆశిస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీ ఆశావహులు పరేషాన్‌లో పడ్డారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్‌ మైనార్టీ కాంగ్రెస్‌ నాయకులకు కోఆప్షన్‌ ఇస్తామని భరోసానిచ్చినట్లు తెలుస్తోంది. మద్దూర్‌లో సైతం తమకు చైర్మన్‌ పదవి ఇవ్వాలని బీఆర్‌ఎస్‌కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకుడు పట్టుపడుతున్నారు. కాగా, అక్కడ లోకల్‌ లొల్లి నడుస్తోంది. మద్దూర్‌ పట్టణానికి చైర్మన్‌, విలీనమైన గ్రామాల్లో గెలిచే వారికి వైస్‌చైర్మన్‌ పదవి కట్టబెడుతామని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పెద్దలు సూచించినట్లు సమాచారం.

గెలుపు గుర్రాల కోసం జల్లెడ..

మున్సిపల్‌ వార్డుల్లో గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీలు జల్లెడ పడుతున్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పోటాపోటీగా ఉన్న వార్డుల్లో పార్టీ అధినేతలు తమదైన శైలిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కొక్క వార్డును క్లియర్‌ చేస్తున్నారు. ప్రధానంగా సీఎం ఇలాకాలోని మద్దూర్‌, కోస్గి మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని.. అన్ని వార్డులను క్లీన్‌చిట్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో మాత్రం రసవత్తర రాజకీయం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ లు సీట్ల కేటాయింపు అంతా రహస్యంగా కొనసాగిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ మాత్రం తమకు అనుకూలంగా ఉన్న వార్డుల్లో అభ్యర్థులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అసంతృప్తుల మద్దతు ఎవరికో..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు పోటాపోటీ పడుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో ఒక్కో వార్డుకు ఇద్దరు నుంచి ముగ్గురు పోటీపడుతుండగా.. అధికార కాంగ్రెస్‌ పార్టీలో నలుగురు నుంచి ఐదుగురు పోటీపడుతున్నారు. ఆయా పార్టీల అధినేతలు ఆశావహులను ఒక్కొక్కరిని సంప్రదించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఒకవేళ పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే ఎవరికి మద్దతు ఇస్తారని ఆశావహులను అడుగుతుండటంతో ఖంగుతింటున్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా పనిచేస్తామని కొంతమంది.. తమకే టికెట్‌ ఇవ్వాలని మరికొంత మంది ఆశావహులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆశావహులందరూ కలిసి చర్చించుకొని ఎవరిని నిర్ణయిస్తే వారికే అవకాశం కల్పిస్తామని.. ఆ అభ్యర్థి గెలుపు బాధ్యతలు ఆశావహులదే అంటూ చెబుతుండటంతో కొందరు అంతర్మథనంలో పడుతున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో అనుకూలించని రిజర్వేషన్లు

పార్టీ మారి తప్పుచేశామంటూ తాజా మాజీ కౌన్సిలర్ల మనోవేదన

అభ్యర్థుల ఎంపికలో తలలు పట్టుకుంటున్న ప్రధాన పార్టీలు

ఆశావహులకు నచ్చజెప్పే పనిలో నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement