‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
నారాయణపేట: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయుల నిరంతర కృషి, పాఠశాల స్థాయి పర్యవేక్షణ కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖపై కలెక్టర్ నేతృత్వంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్‌ఎల్‌ఎన్ పనితీరును తెలుసుకున్న కలెక్టర్.. బేస్‌లైన్ నుంచి మిడ్‌లైన్ వరకు ఫలితాల్లో జిల్లా ర్యాంకు 5వ స్థానానికి పడిపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంఈఓలు, జీహెచ్‌ఎంలు టార్గెట్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ మార్క్ టెస్ట్‌కు సంబంధించి మండలాల వారీగా సమాచారాన్ని సేకరించి.. తదుపరి సమీక్షలో అంశాల వారీగా విశ్లేషణ చేయనున్నట్లు తెలిపారు. ఎల్‌ఐపీ డేటాను పాఠశాలల వారీగా వెంటనే వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమున్న పాఠశాలల్లో వలంటీర్లను వినియోగించుకోవచ్చని సూచించారు. కొన్ని పాఠశాలల్లో వలంటీర్ల సహకారం మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. జిల్లాలో అమలవుతున్న యంగ్ రోటరీ క్లబ్, ఫైనాన్స్ లిట్రసీ, ఇన్ క్వాలియాబ్ ఫౌండేషన్, ఫ్యూచర్ డాట్స్, వేదిక్ మ్యాస్ వంటి కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా కొనసాగించాలని సూచించారు. నూతన పద్ధతులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయన్నారు. ఖాన్ అకాడమీ రిజిస్ట్రేషన్లు వందశాతం పూర్తి చేయాలని.. ఇంటి ప్రాక్టీస్‌పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో ఫలితాల మెరుగుదలకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ – ఏఎక్స్‌ఎల్ ప్రోగ్రాం కొడంగల్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతున్నందున.. కంప్యూటర్ వినియోగాన్ని పెంచి అభ్యసన సామర్థ్యం మెరుగుపర్చాలని కలెక్టర్ సూచించారు. ఫిబ్రవరి 26న రాష్ట్రస్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్‌లో జిల్లా మొదటి స్థానం సాధించేందుకు లక్ష్యం నిర్దేశించారు. సమావేశంలో డీఈఓ గోవిందరాజులు, ఏఎంఓ విద్యాసాగర్, సీఎంఓ రాజేంద్రకుమార్, ఏఎస్‌సీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


