రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
నారాయణపేట: రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఎస్పీ డా.వినీత్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించి.. ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఆరైవ్.. అలైవ్ కార్యక్రమం చేపట్టామన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గ్రామస్థాయిలో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు ప్రమాద బాధితులు, వారి కుటుంబాలతో కలిసి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, హెల్మెట్. సీటు బెల్ట్ ధరించకపోవడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడమేనని అన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. విద్యార్థులు, యువత రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని సూచించారు. జిల్లాలో నేషనల్ హైవే 81 కి.మీ., స్టేట్ హైవే 38 కి.మీ., ఇతర రహదారులు 411 కి.మీ. ఉన్నాయని.. అందులో జిల్లావ్యాప్తంగా 4 బ్లాక్ స్పాట్స్ గుర్తించినట్లు ఎస్పీ వివరించారు. పెద్ద చింతకుంట గ్రామ శివారు, దండు ఎక్స్‌రోడ్డు, నాచారం శివారు, ధన్వాడ మండల శివారులో బ్లాక్‌స్పాట్స్ గుర్తించి.. అక్కడ ప్రత్యేకంగా బారీకేడ్లు, సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 106 మంది చనిపోగా, 2025లో 99 మంది చనిపోయారన్నారు. ఈ సంవత్సరం ఇంకా తగ్గించేందుకు ఆరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ఏడాది పొడవునా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఎస్‌ఐ నరేశ్ ఉన్నారు.


