దరఖాస్తు చేసుకోండి
నారాయణపేట: జిల్లాలోని దివ్యాంగులు తమకు అవసరమైన సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్, జిల్లా సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర దివ్యాంగుల, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమశాఖ, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు 14 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, 8 ల్యాప్‌టాప్‌లు, 9 ట్యాబ్‌లు, 2 5జీ స్మార్ట్‌ఫోన్లు కేటాయించినట్లు తెలిపారు. దరఖాస్తుదారులు పూర్తి అవగాహనతో, జాగ్రత్తగా తమ అర్హతలకు అనుగుణంగా ఈ నెల 30వ తేదీలోగా https://tgobmms.cgg. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
నారాయణపేట: జిల్లాలోని నిరుద్యోగ యువతకు మహబూబ్‌నగర్ ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్‌తో పాటు బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీ పరీక్షలపై 5 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డిగ్రీ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా www.tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు వచ్చే నెల 8న అర్హత పరీక్ష ఉంటుందని.. ఎంపికై న అభ్యర్థులకు భోజన, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు. శిక్షణకాలంలో 600 సెషన్లు, 900 గంటల నాణ్యమైన తరగతుల బోధన ఉంటుందని, స్టడీ మెటీరియల్, పర్సనల్ అలవెన్స్ అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 89773 40006, 83096 57774 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్‌ఓ.రషీద్, డీవైఎస్‌ఓ వెంకటేశ్ శెట్టి, సీపీఓ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీతోనే వ్యవసాయ పథకాలు
నర్వ: రైతులు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యవసాయ పథకాలు వర్తిస్తాయని డీఏఓ జాన్‌సుధాకర్ అన్నారు. మంగళవారం నర్వలోని పెస్టిసైడ్స్, సీడ్స్ దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రికార్డుల్లో ఫార్మర్ ఐడీ కలిగిన రైతులకు సంక్షేమ పథకాలతో పాటు రాయితీలు, రుణాలు, బీమా సౌకర్యం పొందగలుగుతారని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్‌నిధి, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర పథకాలకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని అన్నారు. రైతులు ఏఈఓలను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు. మీసేవ కేంద్రాల్లోనూ నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. డీఏఓ వెంట ఏఓ అఖిలారెడ్డి, ఏఈఓలు శ్వేత, కథలప్ప, హర్షియా ఉన్నారు.
రాష్ట్ర సాఫ్ట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థులు
ధన్వాడ: నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు జరిగే ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–17 సాఫ్ట్‌బాల్ పోటీలకు పీఎంశ్రీ కొండాపూర్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉదయ్‌కుమార్, ఓంకార్, సైదులు ఎంపికయ్యారు. మంగళవారం గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్ రాజారాం, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అభినందించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు విజయానికి కృషి చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సాంబియా నాయక్, పీఈటీ ఆంజనేయులు, కోచ్ రామ్మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోండి


