దళారుల పత్తి దందా!
మరికల్: పత్తి క్రయ విక్రయాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం రూపొందించిన సాంకేతికతను వినియోగించుకొని దళారులు అక్రమాలకు తెర లేపారు. రైతు పత్తి సాగుచేసి ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు ధ్రువీకరణ ఉంటుంది. రైతే కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుంటారు. వచ్చి వేలిముద్ర వేసి పత్తి తనదేనని ధ్రువీకరిస్తారు. అధికారులకు సైతం అంతుపట్టని విధంగా దళారులు రైతుల పేరిట సాగిస్తున్న దందా ఇది.
జిల్లాలో సాగు..
జిల్లావ్యాప్తంగా 6.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీఐ కపాస్ కిసాన్‌యాప్ ద్వారా బుకింగ్ విధానం అమలు చేస్తోంది. దీని ప్రకారం జిల్లాలోని ఏ కేంద్రంలోనైనా స్లాట్ బుక్ చే సుకొని పత్తి విక్రయించుకునే వీలుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు దందా సాగిస్తున్నారు. మరికల్, మక్తల్, ఊట్కూర్, నర్వ తదితర మండలాల్లో అధిక శాతం రైతుల పేరిట రాజమార్గంలో సీసీఐకి పత్తి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
విక్రయిస్తున్నారు ఇలా..
గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని ఒకేసారి పెద్ద మొత్తంలో భారీ వాహనాల్లో నింపుతున్నారు. పత్తి సాగు చేసిన రైతులను ఎంపిక చేసుకొని వారి పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్‌లు తీసుకొని వారికి సంబంధించిన ఒకరి పేరున స్లాట్ బుక్ చేస్తారు. పట్టాదారు రాలేరని లేదా కౌలు తీసుకొని సాగు చేస్తున్నట్లు ఏఈఓల నుంచి ధ్రువీకరణపత్రాలు తీసుకొని సీసీఐలో సంబంధిత రైతు పేరున విక్రయిస్తున్నారు. రెండు, మూడు స్లాట్లు ముందే బుక్ చేసుకొని వేర్వేరు రైతుల పేరున విక్రయిస్తారు. అధికారులు విచారణ చేసినా ఎక్కడా ఆధారాలు లభించే అవకాశం లేదు. ఒకవేళ అనుమానం వచ్చి నిలదీసినా పత్తి సాగు చేశామని, దొంగ దందా చేసేందుకు తమకు ఏం కర్మంటూ ఏఈఓలతో గొడవకు దిగుతున్నారు.
కర్ణాటక నుంచి కూడా..
కొందరు రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక నుంచి పత్తి కొనుగోలు చేసి స్థానిక రైతుల పేరున విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెక్‌పోస్టు వద్ద ఎంతోకొంత ముట్టజెప్పి వాహనాలను జిల్లా లోని సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల ఇళ్లల్లో నిల్వలు లేవని.. సీజన్ చివరిలో ఇంత పెద్దమొత్తంలో పత్తిని ఎలా తెస్తారని ఇతర రైతులు ప్రశ్నిస్తున్నారు. భారీ వాహనాల్లో వస్తున్న పత్తికి సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించకపోవడంతో దళారుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
రైతుకు క్వింటాకు రూ.250
స్లాట్‌బుక్ చేసి సీసీఐలో విక్రయిస్తే రైతుకు క్వింటాకు రూ.250 చొప్పున దళారి చెల్లిస్తున్నారు. సీసీఐ దగ్గర ఫొటో దిగడానికి వస్తే మద్యంతో పాటు బిర్యాని ప్యాకెట్ ఇస్తారు. అనుమానం వచ్చి ఆరా తీసిన ఏఈఓలతో రైతులతో పాటు దళారులు కూడా గొడవలకు దిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
నిబంధనలు ఇలా..
పత్తి విక్రయించే రైతు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి.
తప్పనిసరిగా కేంద్రానికి వచ్చి వేలిముద్ర వేయాలి.
ఎకరాకు ఏడు క్వింటాళ్ల చొప్పున ఒకరోజు 35 క్వింటాళ్లకు మించి విక్రయించడానికి లేదు.
రైతుల పేరిట స్లాట్ బుకింగ్
‘కపాస్’ సాక్షిగా అక్రమాలు
క్వింటాకు రూ.250 చొప్పున రైతులకు చెల్లింపు
అధికారులకు సైతం
అంతుచిక్కని అక్రమ వ్యాపారం
దళారుల పత్తి దందా!


