ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో శుక్రవారం ఆర్టీసీ డ్రైవర్లు, వాహనదారులకు ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపరాదని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో సెల్‌ఫోన్ వినియోగించరాదని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. రహదారి భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య, ఏఎంవీఐ సాయితేజారెడ్డి రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హాజరైన డ్రైవర్లు, వాహనదారులు పోలీసుల సూచనలు, నియమాలు పాటిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ఎస్‌ఐ చెప్పారు.


