
సృజనాత్మకత చాటాలి
ఊట్కూరు: విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు ఇతర అంశాల్లోనూ సృజనాత్మకత చాటాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని బిజ్వార్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, విద్యార్థుల హాజరుశాతం తదితర వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులు చిత్రీకరించిన చిత్రాలు, అల్లికలు తదితర క్రాఫ్ట్ కృత్యాలను ట్రెయినీ కలెక్టర్ పరిశీలించి అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు క్రీడలు, చిత్రలేఖనం, అల్లికలపై ఆసక్తి పెంచుకోవడంతో పాటు సాంకేతిక విద్యలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధనుంజయ్యగౌడ్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం గౌరమ్మ, హెచ్‌ఎం కిషోర్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు
పరిష్కరించండి
నారాయణపేట రూరల్: అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ అమలుచేసి.. పదోన్నతులు కల్పించాలన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. పాఠశాలల హేతుబద్ధీకరణ జీఓ 25ని సవరించి.. ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పీఆర్‌సీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో వచ్చేనెల 5వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అబ్దుల్ ఖాదర్, భాస్కర్, వెంకటేశ్వర్రెడ్డి, రుద్రసముద్రం రాములు, అశోక్, ప్రతాప్, వెంకటయ్య, నర్సింహులు, జహంగీర్ తదితరులు ఉన్నారు.

సృజనాత్మకత చాటాలి