
ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. బుధవారం నారాయణపేట మండలం బొమ్మన్‌పాడు ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు కలెక్టర్ పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఎఫ్‌ఏ–1 పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం తయారీకి నాణ్యమైన కూరగాయలు, వంట సరుకులు వినియోగించాలని ఆదేశించారు. బోధన సమయంలో టీఎల్‌ఎం ఉపయోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలన్నారు.
● కోటకొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలో ఓపీ తక్కువగా నమోదు కావడం, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్క ప్రసవం కూడా జరగకపోవడం, జూలైలో రెండు మాత్రమే కాన్పులు కావడం, ఈడీడీ అప్‌డేట్ లేకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. 10 సబ్ సెంటర్లకు 16మంది డాక్టర్లు ఉన్నప్పటికీ.. పీఓ ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు. ఏఎన్‌సీ, టీబీ, ఎన్‌సీడీ కార్యక్రమాల తీరు సక్రమంగా లేకపోవడం.. మందుల నిల్వ అంతంతమాత్రంగా ఉండటం ఏమిటని సిబ్బందిని నిలదీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని సబ్ సెంటర్లలో మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. టీబీ నివారణపై కార్యాచరణ పటిష్టంగా అమలు చేయాలన్నారు. అనంతరం కోటకొండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. మొదటి విడతలో 31 ఇళ్లు మంజూరు కాగా.. 28 గ్రౌండింగ్ అయ్యాయని, మిగతా వాటిని వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.